26 ఏండ్ల తర్వాత డ్యామ్ గేట్లు ఎత్తారు

26 ఏండ్ల తర్వాత డ్యామ్ గేట్లు ఎత్తారు

 తిరువనంతపురం: కేరళలోని ఇడుక్కి రిజర్వాయర్‌పై ఉన్న చెరుతోని డ్యామ్ ఐదు గేట్లలో ఒక గేటును అక్కడి విద్యుత్ బోర్డు అధికారులు తెరిచారు. ఈ డ్యామ్ గేట్లు 26 ఏండ్ల తర్వాత తెరుచుకోవడం విశేషం. రిజర్వాయర్‌లో నీటి మట్టం 2398 అడుగులకు చేరడంతో అధికారులు ఒక గేటు ఎత్తారు. ఆసియాలో అతిపెద్ద డ్యాముల్లో ఒకటైన ఇడుక్కి రిజర్వాయర్ గరిష్ఠ నీటి నిల్వ స్థాయి 2403 అడుగులు. 1975లో నిర్మితమైన ఈ డ్యామ్ గేట్లను గతంలో కేవలం రెండుసార్లు మాత్రమే తెరిచారు. అది కూడా అక్టోబర్, నవంబర్‌లలో వచ్చే ఈశాన్య రుతుపవనాల సందర్భంగానే తెరిచారు.

ఈసారి మాత్రం భారీ వరదల కారణంగా నైరుతి రుతుపవనాల సమయంలోనే తెరవాల్సి వచ్చింది. ఇడుక్కి రిజర్వాయర్ నుంచి వదిలిన నీళ్లు చెరుతోని నది ద్వారా కిలోమీటర్ దూరంలోని పెరియార్‌తో కలుస్తుంది. డ్యాంలోని మధ్య గేటును తెరిచినట్లు కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ వెల్లడించింది. ఈ గేటును 50 సెంటీమీటర్ల మేర తెరిచారు. దీనిద్వారా సెకండుకు 50 వేల లీటర్ల నీళ్లు దిగువకు వెళ్తుంది. అవసరమైతేనే మిగతా గేట్లు తెరుస్తామని అధికారులు స్పష్టంచేశారు.