8.7 కోట్ల మంది డాటా దుర్వినియోగం

8.7 కోట్ల మంది డాటా దుర్వినియోగం

 వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్తంగా 8.7 కోట్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారుల సమాచారం దుర్వినియోగమైందని ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఒప్పుకున్నారు. దాదాపు 5 కోట్ల మంది సమాచారం దుర్వినియోగమైనట్లు మొదట అంచనా వేశామని, కానీ అంచనాకు మించి సమాచారం దుర్వినియోగమైందని తెలిపారు. వివిధ దేశాల్లో ముఖ్యంగా అమెరికాలో ఎన్నికలను ప్రభావితం చేయడానికి లండన్‌కు చెందిన కేంబ్రిడ్జ్ ఎనలిటికా సంస్థ ఫేస్‌బుక్ వినియోగదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జుకర్‌బర్గ్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ పెద్ద తప్పు జరిగింది. 

తప్పును ఒప్పుకుంటున్నా. ఆ తప్పంతా నాదే. మనుషులు తప్పులు చేయడం సహజం. ఆ తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోవడం కీలకం. నాతప్పును గుర్తించా. ఫేస్‌బుక్ సంస్థను సక్రమంగా నడుపడానికి నాకు మరో అవకాశం ఇవ్వండి అని తెలిపారు. మొత్తం 8.7 కోట్ల మంది ఫేస్‌బుక్ వినియోగదారుల సమాచారం దుర్వినియోగం కాగా, అందులో ఎక్కువగా అమెరికాకు చెందిన వినియోగదారులే ఉన్నారని చెప్పారు. భారత్‌లో 5.62 లక్షల మంది ఫేస్‌బుక్ వినియోగదారుల సమాచారం దుర్వినియోగమైందని తెలిపారు. ఫేస్‌బుక్‌పై పడిన సమాచార దుర్వినియోగం మరక పోవడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. 

 భారత్‌లో దాదాపు 5.62 లక్షల మంది సమాచారం దుర్వినియోగమైందని ఫేస్‌బుక్ గురువారం ఒప్పుకున్నది. భారత్‌లో ఫేస్‌బుక్ వినియోగదారుల సమాచారం దుర్వినియోగం కావడంపై వివరణ ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నోటీసు జారీ చేసిన నేపథ్యంలో ఆ సంస్థ స్పందించింది. భారత్‌లో కేవలం 335 మంది ఫేస్‌బుక్ వినియోగదారుల సమాచారం ప్రత్యక్షంగా దుర్వినియోగమైంది. మిగతా 5,62,120 మంది ఫేస్‌బుక్ వినియోగదారులు ప్రభావితమయ్యారు అని తెలిపింది. భారత్‌లో ఫేస్‌బుక్ వినియోగదారులు 20 కోట్ల మంది ఉన్నారని చెప్పింది. మరోవైపు లండన్‌కు చెందిన కేంబ్రిడ్జ్ ఎనలిటికా స్పందన వచ్చిన తర్వాతే ఫేస్‌బుక్ సమాచార దుర్వినియోగంపై ఏం చర్యలు తీసుకోవాలన్న దానిపై నిర్ణయిస్తామని కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి.