ఆడ‌వాళ్లూ.. శబరిమల అయ్య‌ప్ప‌ను ద‌ర్శించుకోవ‌చ్చు..

ఆడ‌వాళ్లూ.. శబరిమల అయ్య‌ప్ప‌ను ద‌ర్శించుకోవ‌చ్చు..

 న్యూఢిల్లీ: ఇక నుంచి అన్ని వయసుల మహిళలు శబరిమలలో ఆయ్యప్పను దర్శించుకోవచ్చు. ఆడవాళ్లపై ఉన్న ఆలయ ప్రవేశ నిషేధాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో ఇవాళ అత్యున్నత న్యాయస్థానం వివాదాస్పద అంశంపై సంచలన తీర్పును వెలువరించింది. 10 నుంచి 50 ఏండ్ల మధ్య వయసున్న స్త్రీలు కూడా శబరిమల అయ్యప్పను దర్శించుకోవచ్చు అని తీర్పునిచ్చింది. పురుషుల కన్నా మహిళలు దేంట్లోనూ తక్కువ కాదని, ఓ వైపు మహిళలను దేవతలుగా పూజిస్తూ, మరో వైపు వారిపై నిషేధాన్ని విధించడం సరికాదు అని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు. శారీరక, భౌతిక కారణాలను చూపిస్తూ దేవుడితో బంధాన్ని తుంచివేయలేమని సీజేఐ అన్నారు. ధర్మాసనంలో ఉన్న నలుగురు జడ్జీలు చీఫ్ జస్టిస్‌తో అంగీకరించారు. జస్టిస్ ఇందూ మల్హోత్రా మాత్రం సుప్రీం తీర్పును వ్యతిరేకించారు. అయ్యప్ప భక్తులు హిందువులే అని, వాళ్లు ప్రత్యేకమైన మతం కలిగిన వారు కాదని, శబరిమల దేవస్థానం పెట్టిన నిబంధనను తప్పనిసరిగా భావించాల్సిన అవసరం లేదని సీజేఐ తెలిపారు. 10 నుంచి 50 ఏళ్ల మహిళలపై ఆలయ ప్రవేశ నిషేధాన్ని విధించడం రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించడమే అవుతుందని కోర్టు పేర్కొన్నది. దేవుడిని ప్రార్థించే హక్కు అందరికీ ఉందన్నారు. లింగ బేధం ఆధారంగా వివక్ష చూపలేమన్నారు.