ఆధార్‌ సాఫ్ట్‌వేర్‌ హాకింగ్‌....!

ఆధార్‌ సాఫ్ట్‌వేర్‌ హాకింగ్‌....!

 న్యూఢిల్లీ: 2009లో ప్రవేశపెట్టిన నాటి నుండి హాట్‌ టాపిక్‌గా కొనసాగుతున్న ఆధార్‌ గుర్తింపు విధానానికి సంబంధించిన డేటా సెక్యూరిటీ మరోసారి వార్తలకెక్కింది. ఆధార్‌ సాఫ్ట్‌ వేర్‌ హాకింగ్‌కి గురైందని, ఫలితంగా ఆధార్‌ డేటాబేస్‌ దుర్వినియోగమవుతోందని దాదాపు మూడు నెలలకు పైగా నిర్వహించిన ఒక అధ్యయనంలో బయటపడింది. భారత విశిష్ట గుర్తింపు వ్యవస్థ (యుఐడిఎఐ) రూపొందించిన ఈ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన చిన్న లోపంతో హాకర్లు అనధీకృత ఆధార్‌ నంబర్లను చెలామణిలోకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ సాఫ్ట్‌వేర్‌ వినియోగానికి సంబందించి ఏకకాల ఛార్జి రు.2,500 చెల్లిస్తే ఆధార్‌ నమోదు ఆపరేటర్‌గా మారిపోవచ్చు.

ఈ వెసులుబాటును ఉపయోగించుకుని దేశవ్యాప్తంగా వేలాది మంది ఆధార్‌ నమోదు ఆపరేటర్లు పుట్టగొడుగుల్లా వెలిసారు. తాజాగా జరిగిన సాఫ్ట్‌వేర్‌ హాకింగ్‌కు 2010లో యుఐడిఎ తీసుకున్న నిర్ణయంతో బీజం పడినట్లు తెలుస్తోంది. ఆధార్‌ నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రయివేటు ఆపరేటర్లను నియమించాలని నాడు యుఐడిఎఐ నిర్ణయించింది. యుఐడిఎఐ ప్రస్తుతం తన సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి ముఖాన్ని గుర్తించే విధానానికి తెరతీసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ హాకింగ్‌ జరిగినట్లు తెలుస్తోంది.

యుఐడిఎఐ ప్రతిపాదిస్తున్న విధానం ద్వారా ప్రస్తుతం గుర్తింపు తనిఖీకి వినియోగిస్తున్న వేలిముద్రలు, ఐరిష్‌ వంటి వాటితో పాటు ముఖ గుర్తింపు కూడా అవసరమవుతుంది. ఆధార్‌ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన ఈ లోపాన్ని తాము గుర్తించి, నిపుణుల పరిశీలన అనంతరం నిర్ధారించినట్లు హఫ్‌పోస్ట్‌ ఇండియా వెల్లడించింది. ఈ లోపంగురించి యుఐడిఎఐ స్పందన కోరినపుడు అక్కడి అధికారులు జవాబిస్తూ ప్రస్తుతం వున్న వేలిముద్రలు, ఐరిష్‌ గుర్తింపునకు అదనంగా ముఖ గుర్తింపు వ్యవస్థను జోడిస్తున్నామని, దీని ద్వారా ఈ లోపాన్ని అధిగమిస్తామని చెబుతున్నారు.