ఆధార్‌కు బిల్‌గేట్స్ ప్రశంస

ఆధార్‌కు బిల్‌గేట్స్ ప్రశంస

  వాషింగ్టన్ : భారతదేశంలో అమలు చేస్తున్న ఆధార్ ప్రక్రియ ఎంతో ఉన్నతమైనదని, దానితో ఎన్నో ప్రయోజనాలున్నాయని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ పేర్కొన్నారు. ఆధార్‌తో పరిపాలనలో నాణ్యత పెరుగుతుందని, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని, ప్రజలు సాధికారత పొందుతారని గేట్స్ అభిప్రాయపడ్డారు. ఈ విశిష్ట గుర్తింపు విధానాన్ని ఇతర దేశాలు కూడా అనుసరించవచ్చని చెప్పారు. ఇతర దేశాల్లో ఆధార్ తరహా విధానాన్ని అమలు చేసేందుకు తమ బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన తరఫున ప్రపంచబ్యాంక్‌కు నిధులు అందజేస్తామని ప్రకటించారు.

ఈ విషయంలో ఆధార్ ప్రధాన రూపకర్త, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని ప్రపంచబ్యాంక్‌కు సహకరిస్తున్నారని బిల్‌గేట్స్ పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థ అయిన ఆధార్‌లో వందకోట్ల మందికి పైగా భారతీయులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని బిల్‌గేట్స్ గుర్తు చేశారు. అది కేవలం బయో ఐడీ తనిఖీ పథకం అయినందున వ్యక్తుల గోప్యతకు ఎటువంటి నష్టం ఉండదని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు.