అతనో ‘క్రిమినల్‌’ : మేనకా గాంధీ ఆగ్రహం

అతనో ‘క్రిమినల్‌’ : మేనకా గాంధీ ఆగ్రహం

   ముంబయి : షూటర్‌ నవాబ్‌ షఫత్‌ అలీ ఖాన్‌ ఒక క్రిమినల్‌ అని, అతనితో మహారాష్ట్ర ప్రభుత్వం అవని అనే పులిని చంపించిందని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రి, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల యవత్మల్‌ సమీప ప్రాంతాలకు చెందిన 13 మంది గ్రామ స్తులను పొట్టనబెట్టుకుని 'మాన్‌ ఈటర్‌'గా మారిన ఆ పులిని సుప్రీంకోర్టు తీర్పు మేరకు కాల్చి చంపేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అలీఖాన్‌ను నియమించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె వరుస ట్వీట్లతో విమర్శలు గుప్పించారు. ఖాన్‌ మూడు పులులు, 10 చిరుత పులులు, ఏనుగులతో పాటు చంద్రాపూర్‌ ప్రాంతం లో 300 వరకు అడవి పందులను కాల్చి చంపినట్లు మంత్రి తెలిపారు. అతను ఉగ్రవాదులకు తుపాకులు సరఫరా చేసేవారని, హైదరాబాద్‌లో ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడని ట్వీట్‌ చేశారు. అయితే ఈ ఆరోపణలను ఖాన్‌ ఖండించారు. తనను ఉగ్రవాది, జాతివ్యతిరేకిగా పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను క్రిమినల్‌గా ఆరోపించిన మంత్రిపై కేసు పెట్టనున్నట్లు తెలిపారు.