అయోధ్య కేసులో మరో మలుపు

అయోధ్య కేసులో మరో మలుపు

  న్యూఢిల్లీ: అయోధ్యలోని వివాదాస్పద భూమి కేసు విచారణ మరో మలుపు తిరిగింది. ఈ కేసుపై విచారణకు ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిస్ యూయూ లలిత్ తప్పుకున్నారు. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఏర్పడిన రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యునిగా ఉన్న జస్టిస్ లలిత్ అయోధ్యపై కేసు విచారణలో పాల్గొనేందుకు తన అయిష్టతను వ్యక్తం చేశారు. దీంతో తాజాగా మరోసారి రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని, కేసు విచారణ ఈ నెల 29 నుంచి ప్రారంభమవుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. జస్టిస్ లలిత్ తప్పుకున్నందున కేసును వాయిదా వేయడం తప్ప తమకు మరొక మార్గం లేదని పేర్కొంది. 


ఈ కేసు విచారణ కోసం ధర్మాసనం గురువారం ఆసీనమవగానే ఓ ముస్లిం పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్ మాట్లాడుతూ, ధర్మాసనంలో సభ్యునిగా ఉన్న జస్టిస్ యూయూ లలిత్ 1997లో ఒక న్యాయవాదిగా ఇదే కేసులో ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్ తరఫున వాదనలు వినిపించారని గుర్తు చేశారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో యథాతథ స్థితిని కొనసాగించడంలో అప్పుడు సీఎంగా ఉన్న కల్యాణ్‌సింగ్ విఫలమయ్యారని, దీంతో అక్కడున్న బాబ్రీ మసీదును కూల్చివేశారని చెప్పారు. న్యాయమూర్తులు ఎస్‌ఏ బాబ్డే, ఎన్వీ రమణ, డీవై చంద్రచూడ్ కూడా సభ్యులుగా ఉన్న ధర్మాసనం న్యాయవాది ధవన్ వ్యాఖ్యలను గమనంలోకి తీసుకుంది. దాదాపు 20 నిమిషాలపాటు సాగిన వాదనల అనంతరం, ఈ కేసును విచారిస్తున్న ధర్మాసనంలో జస్టిస్ లలిత్ సభ్యుడిగా ఉండటంపై న్యాయవాది రాజీవ్ ధవన్‌కు అభ్యంతరం లేదని, ఇక నిర్ణయం తీసుకోవాలని ఆ న్యాయమూర్తే అని పేర్కొంది. 

అనంతరం జస్టిస్ లలిత్ ఈ ధర్మాసనంలో కొనసాగేందుకు అయిష్టత వ్యక్తం చేస్తున్నారని, అందువల్ల తమకు కేసు విచారణను వాయిదా వేయక తప్పడం లేదని తెలిపింది. అంతకుముందు రాజీవ్ ధవన్ మాట్లాడుతూ, ఈ కేసును తొలుత ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి నివేదిస్తారని తెలిపారని, కానీ సీజేఐ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేశారని అన్నారు. ఇందుకు చట్టపరమైన ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందన్నారు. దీనిపై సీజేఐ స్పందిస్తూ, ఏ ధర్మాసనంలోనైనా ఇద్దరు సభ్యులుండాలంటూ సుప్రీంకోర్టు 2013లో ఇచ్చిన రూలింగ్‌ను గుర్తు చేశారు. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం తప్పు కాదని స్పష్టం చేశారు. వాస్తవాలు, పరిస్థితులను పరిశీలనలో ఉంచుకొని, ఈ కేసుకు సంబంధించి భారీ సంఖ్యలో పత్రాలు ఉన్నందున, విచారణకు ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏర్పాటు చేయడం సహేతుకం అని ఆయన చెప్పారు. 50 సీల్డ్ ట్రంకు పెట్టెల్లో ఉన్న రికార్డులను కోర్టు రిజిస్ట్రీ పరిశీలిస్తుందని అన్నారు. ఆ పత్రాలలో కొన్ని సంస్కృతం, అరబిక్, ఉర్దూ, హిందీ, పర్షియన్, గుర్ముఖి భాషలలో ఉన్నాయని, వాటిని అనువాదం చేయాల్సి ఉంటుందని చెప్పారు.

ఈ విచారణలో 113 అంశాలను కోర్టు పరిశీలించాల్సి ఉంటుందని ధర్మాసనం తెలిపింది. అలహాబాద్ హైకోర్టు ముందు విచారణ జరిగినప్పుడు 88 మంది సాక్షులను విచారించి, వారి వాంగ్మూలాలను రికార్డు చేశారని పేర్కొంది. సాక్షుల వాంగ్మూలం 2,886 పేజీలు ఉందని, వాటికితోడు 257 డాక్యుమెంట్లు కూడా ఉన్నాయని తెలిపింది. హైకోర్టు తీర్పు ప్రతి 4,304 పేజీలుండగా, అనుబంధాలతో కలిపి మొత్తం 8వేల పేజీలుందని పేర్కొంది. గత ఏడాది సెప్టెంబర్ 27న, అయోధ్య భూవివాదంపై విచారణ జరిగిన సందర్భంగా, 1994 నాటి తీర్పులో.. ఇస్లాం మతంలో మసీదు భాగం కాదు అంటూ చేసిన వ్యాఖ్యలను పునఃపరిశీలించేందుకు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు 2:1 మెజార్టీతో తిరస్కరించింది. తిరిగి ఈ నెల 4న ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు.. దీనిపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తారన్న సంకేతాలు కనిపించలేదు. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ 14 పిటిషన్లు దాఖలయ్యాయి.