‘ఆఫ్ఘన్‌తో బంధం భారత్‌కు ప్రాధాన్య‌త‌’

‘ఆఫ్ఘన్‌తో బంధం భారత్‌కు ప్రాధాన్య‌త‌’

  న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్తాన్‌ వ్యవహారాల్లో భారత్‌కు ఆసక్తి వుందని, ఆ బంధం నుండి బయటకు రారాదని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ గురువారం తెలిపారు. ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతల కోసం తాలిబన్‌ను కూడా చర్చల వద్దకు తీసుకురావడానికి అమెరికా నేతృత్వంలో జరుగుతున్న ప్రయత్నాలను ఈ సందర్భంగా ఉదహరించారు. ఆఫ్ఘనిస్తాన్‌ వ్యవహారాల పట్ల భారత్‌కు ఆసక్తి వున్నందున ఏదో రకంగా ప్రమేయం వుండి తీరాలని భావిస్తున్నట్లు ఆర్మీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వార్షిక పత్రికా సమావేశంలో ఆయన తెలిపారు. 

చర్చల్లో తాము కూడా పాల్గొనాల్సిందేనని, లేనిపక్షంలో ఏం జరుగుతోందనేది తెలియదని అన్నారు. తాలిబన్‌తో చర్చలు జరపకూడదనేది భారత్‌ సాంప్రదాయంగా పాటిస్తూ వచ్చిన పద్ధతని, ఆఫ్ఘన్‌ నేతృతవంలో, ఆ దేశ పరిస్థితులకు అనువైన పరిష్కారం వుండాలనేది తమ కల అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కాశ్మీర్‌లో వేర్పాటువాదులతో కేంద్రం ఎందుకు చర్చలు జరపదనేది ప్రశ్నగా మిగిలింది. అయితే ఈ విషయమై జనరల్‌ రావత్‌ను ప్రశ్నించగా, కాశ్మీర్‌లో పరిస్థితికి, ఆఫ్ఘన్‌లో పరిస్థితికి చాలా తేడా వుందని వ్యాఖ్యానించారు.