అలహాబాద్‌ వర్సిటి విద్యార్ధుల ఆందోళన

అలహాబాద్‌ వర్సిటి విద్యార్ధుల ఆందోళన

  అలహాబాద్‌ : ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో న్యాయ విద్యార్థి దిలీప్‌ సరోజ్‌ హత్యను నిరసిస్తూ అలహా బాద్‌ విశ్వవిద్యాలయ విద్యార్ధులు ఆందోళనబాట పట్టారు. విద్యార్ధుల నిరసన నినాదాలతో వీధులన్నీ హోరె త్తాయి. తమ ఆందోళనలో భాగంగా ఒక బస్సుకు నిప్పు పెట్టారు. అలహాబాద్‌లోని ఒక రెస్టారెంట్‌ వద్ద శుక్రవారం 26 ఏళ్ళ న్యాయ విద్యార్థిని కొంతమంది దుండగులు హత్య చేసిన సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విద్యార్ధులను పోలీసులు అదుపు చేశారు. అలహాబాద్‌లో ఒక రెస్టారెంట్‌లోకి ప్రవేశిస్తున్న ప్రధాన నిందితుడు విజరు శంకర్‌ సింగ్‌ను లోపలి నుండి వస్తున్న దిలీప్‌ సరోజ్‌ యాదృచ్ఛికంగా ఢ కొన్నాడు. 

దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ ప్రారంభమైంది. శంకర్‌ సింగ్‌ హాకీ స్టిక్‌, ఐరన్‌ రాడ్లతో దిలీప్‌ సరోజ్‌ఫై దాడి చేశాడు. ఈ దాడిని అటుగా వెళుతున్న ఒక వ్యక్తి తన మొబైల్‌ ఫోన్‌లో చిత్రీకరించాడు. స్పృహతప్పి పడిపోయిన దిలీప్‌ సరోజ్‌ శనివారం ఆసుపత్రిలో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి రెస్టారెంట్‌ వెయిటర్‌ మున్నా చౌహాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చౌహాన్‌ ఐరన్‌ రాడ్‌తో దిలీప్‌ తలపై కొట్టాడు. ఇదే అతని మృతికి కారణమైంది. పోలీసులు రెస్టారెంట్‌ నుంచి సేకరించిన సిసిటివి ఫుటేజ్‌లను విడుదల చేశారు.