అమెరికాతో మరింత దోస్తీ

అమెరికాతో మరింత దోస్తీ

  న్యూఢిల్లీ: ఈ ఏడాదిలో భారత్‌-అమెరికా మధ్య జరిగిన అత్యున్నత స్థాయి ద్వైపాక్షిక (2+2) చర్చల ప్రక్రియలో ఇరుదేశాలు విస్తృత స్థాయి సైనిక సహకారంపై రెండో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంపై అమెరికా రక్షణ మంత్రి జిమ్‌ మాటిస్‌, భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ సంతకాలు చేశారు. కాంకాసా అనే పేరుతో పిలువబడే ఈ కమ్యూనికేషన్స్‌ కంపాటబులిటీ, సెక్యూరిటీ అగ్రిమెంట్‌ ద్వారా సైబర్‌ కమ్యూనికేషన్స్‌, నిఘా సమాచారం, కమ్యూనికేషన్‌ పరికరాల మార్పిడి, భద్రతతో కూడిన కమ్యూనికేషన్‌ ఛానల్స్‌ ఏర్పాటు వంటి వాటికి వీలు ఏర్పడుతుంది. ఈ కామ్‌కాసా ఒప్పందం ద్వారా భారత్‌ రక్షణ సన్నద్ధతను మెరుగుపరిచేందుకు అమెరికా సహకరిస్తుందని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ వివరించారు.

వచ్చే ఏడాది భారత తూర్పు తీరంలో ఇరుదేశాలు త్రివిధ దళాలతో తొలిసారిగా సంయుక్త సైనిక విన్యాసాలను నిర్వహి స్తాయని ఆమె ప్రకటించారు. గతంలో 2016 ఆగస్టులో ఇరుదేశాలూ లెమోవా పేరిట సైనిక వసతుల వినియోగానికి సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇక మూడో 'మౌలిక' ఒప్పందం ప్రాథమిక మార్పిడి, సహకార ఒప్పందం (బెకా) ప్రస్తుతం చర్చల దశలో వుంది. గురువారం ఇరుదేశాల ప్రతినిధి బృందాలు వేర్వేరుగా ద్వైపాక్షిక భేటీలు జరిపాయి. ఇందులో అమెరికా రక్షణ మంత్రి మాటిస్‌, విదేశాంగ మంత్రి పాం పియో, భారత రక్షణ మంత్రి సీతారామన్‌, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ పాల్గొన్నారు. తాము పరస్పరం నిరంతర సంప్రదింపులు జరిపేందుకు వీలుగా ఇరుదేశాలకు చెందిన రెండు మంత్రిత్వశాఖల మధ్య కొత్త హాట్‌లైన్‌ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నట్లు సుష్మాస్వరాజ్‌ వివరించారు.