ఆరుషి హత్య కేసులో తల్వార్ దంపతులకు ఊరట

ఆరుషి హత్య కేసులో తల్వార్ దంపతులకు ఊరట

 న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 14 ఏండ్ల ఆరుషి హత్యకేసులో ఆమె తల్లిదండ్రులకు ఊరట లభించింది. అలహాబాద్ హైకోర్టు గురువారం రాజేశ్ తల్వార్, నుపుర్ తల్వార్‌లను నిర్దోషులుగా తేల్చింది. ఆరుషిని తల్లిదండ్రులే చంపారనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవని న్యాయస్థానం అభిప్రాయపడింది. వారే చంపినట్లు ఆధారాలు సమర్పించడంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విఫలమైందని కోర్టు పేర్కొన్నది. 

అనుమానాల ఆధారంగా శిక్షలు విధించలేమని అభిప్రాయపడిన కోర్టు బెనిఫిట్ ఆఫ్ డౌట్ (సంశయలాభం) కింద తల్వార్ దంపతులను నిర్దోషులుగా ప్రకటించింది. ఆరుషి, పనిమనిషి హేమరాజ్‌ల హత్యకేసులో దంతవైద్య నిపుణులు రాజేశ్, నుపుర్ తల్వార్ దంపతులను 2013లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. స్పష్టమైన ఆధారాలేవీ లేకపోయినప్పటికీ, హత్యలు జరిగినప్పుడు తల్వార్ దంపతులు మాత్రమే ఆ ఇంట్లో ఉన్నందున, బయటివారు వచ్చే అవకాశమేదీ లేనందున వారే హత్యచేసి ఉంటారని సీబీఐ కోర్టు భావించింది. 

ఆ రోజు ఇంట్లో ఏం జరిగిందనే వాస్తవం తెలిసిన తల్వార్ దంపతులే తమను తాము నిర్దోషులుగా నిరూపించుకోవాలని వ్యాఖ్యానించింది. 2013 నవంబర్ 26న సీబీఐ కోర్టు వారికి జీవితఖైదు విధించింది. ప్రస్తుతం ఆరుషి తల్లిదండ్రులు ఘజియాబాద్ లోని దాస్నా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ తల్వార్ దంపతులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ బీకే నారాయణ, జస్టిస్ ఏకే మిశ్రాలతో కూడిన హైకోర్టు ధర్మాసనం గత సెప్టెంబర్‌లో విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా గురువారం సాయంత్రం ధర్మాసనం వారిని నిర్దోషులుగా తీర్పును ప్రకటించింది.

కేవలం అలా జరిగి ఉండవచ్చునేమో... అనే సంభావ్యతల ఆధారంగానో, సమంజసమైన అనుమానం (రీజనబుల్ డౌట్) ఆధారంగానో నిందితులకు శిక్ష విధించలేమని న్యాయస్థానం స్పష్టంచేసింది. సెక్షన్ 106 ఆధారంగా నేరనిరూపణ భారం నుంచి ప్రాసిక్యూషన్ తప్పించుకోలేదని మనుసింగ్ వర్సెస్ ధర్మేంద్ర కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం గుర్తుచేసింది. నిందితుడే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలనడం సరికాదని 1956లో శంభునాథ్ వర్సెస్ అజ్మీర్ స్టేట్ కేసు సందర్భంగా సర్వోన్నతన్యాయస్థానం చేసిన వ్యాఖ్యల్ని కూడా కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. హైకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేశాక తదుపరి చర్యలపై చర్చిస్తామని సీబీఐ అధికారులు తెలిపారు.