>

అవసరమున్న రైతులకే రుణమాఫీ

అవసరమున్న రైతులకే రుణమాఫీ

 ముంబయి : ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకం మాఫీ అవసరం ఉన్న రైతులకు మాత్రమే వరిస్తుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ పేర్కొన్నారు. సాంకేతిక సహకారంతో నిజమైన అర్హులను గుర్తించి లబ్ధి అందజయేనున్నట్లు తెలిపారు. 2008లో కేంద్ర ప్రభుత్వం ఒక పర్యాయం రుణాలు రద్దు చేసిందన్నారు. అప్పట్లో అది పెద్ద కుంభకోణంగా ఆయన పేర్కొన్నారు. పేద రైతులకు లబ్ధి చేకూరలేదని, ధనిక రైతులు సొమ్మును లూటి చేశారని కాగ్‌ నివేదిక అందజేసిందన్నారు. అప్పట్లో అర్హులకు సరైన లబ్ధి చేకూరలేదన్నారు. తాము ప్రకటించిన మాఫీ అమలుకు ప్రత్యేక కమిటీ వేశామనీ, వారే అర్హులను నిర్ణయిస్తారని తెలిపారు. 

అర్థికస్థిరత్వం ఉన్నవారికీ, వృత్తినిపుణులకు ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీ వర్తించదన్నారు. ప్రభుత్వంపై రూ.25,000 కోట్ల మాఫీ భారం పడనున్న నేపథ్యంలో నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నట్లు తెలిపారు. ఆ భారాన్ని తమ ప్రభుత్వం భరిస్తుందనీ, అమలుకు కొద్ది సమయం పడుతుందనీ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లలో రుణమాఫీ చేయడం ఇక్కడ కూడా రైతుల డిమాండ్‌కు ఊతం ఇచ్చిందన్నారు. ఇది మిగిలిన ప్రాంతాల్లో ధరలు పెరగడానికి కారణం కావచ్చని అభిప్రాయం వెలిబుచ్చారు. అవసరం ఉన్న రైతులకు మాత్రమే మాఫీ వర్తిస్తుందని నొక్కి చెప్పిన ఆయన ఆంధ్రప్రదేశ్‌ తరహాలోనే మాఫీ ప్రక్రియ ఉంటుందన్నారు.

తమ కేబినేట్‌ సమావేశంలో చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే రైతుల కష్టాలను తొలగించడానికి రుణమాఫీ మాత్రమే పరిష్కారం కాదన్నారు. వ్యవసాయం మీద పెట్టుబడులు పెరగడం కూడా ప్రధాన సమస్య అన్నారు. ప్రభుత్వం లక్ష సేద్యపు కుంటల తవ్వకంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. సూక్ష్మ సేద్యానికి కూడా ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. వ్యవసాయాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.25,000 కోట్లు కేటాయించిందని తెలిపారు. రైతుల ఉద్యమాల వెనుక కొన్ని రాజకీయ పార్టీలు ఉండి రెచ్చగొడుతున్నాయన్నారు. రైతుల పోరాటం సందర్భం గా పలుచోట్ల జరిగిన ఘటనల్లో ఎఫ్‌ఐఆర్‌లలో రైతుల పేర్లు కాకుండా రాజకీయ నాయకుల పేర్లు నమోదయ్యాయన్నారు.


Loading...