బంగ్లాలో ఇద్దరు మాజీ మంత్రులు సహా 19 మందికి మరణశిక్ష

బంగ్లాలో ఇద్దరు మాజీ మంత్రులు సహా 19 మందికి మరణశిక్ష

  ఢాకా: 2004లో ఢాకా ఎన్నికల ప్రచారర్యాలీలో జరిగిన గ్రెనేడ్‌ దాడి కేసులో ఇద్దరు బంగ్లాదేశ్‌ మాజీ మంత్రులు సహా 19 మందికి ఉరిశిక్ష విధించినట్టు స్పెషల్‌కోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈకేసులో దోషులుగా రుజువైనవారికి భూమిపై జీవించే హక్కులేదంటూ జస్టిస్‌ షాహెద్‌ నూరుద్దీన్‌ ఉద్వేగభరితంగా తీర్పు వెలువరించారు. మాజీ మంత్రులు, బంగ్లాదేశ్‌ నేషనల్‌ పార్టీ (బీఎన్‌పీ) నేతలు లుత్‌ఫుజామన్‌ బాబర్‌, అబ్దుస్‌ సలామ్‌లకు ఉరిశిక్ష ఖరారైంది. బాబర్‌ గతంలో బంగ్లా హోంశాఖ మంత్రిగా, అబ్దుస్‌ సలామ్‌ డిప్యూటీ విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 

ఇదే కేసులో బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని ఖలిదా జియా కుమారుడు తారిక్‌ రెహ్మాన్‌కు న్యాయస్థానం జీవిత ఖైదు శిక్ష విధించింది.ప్రాసిక్యూషన్‌ వెల్లడించిన వివరాల ప్రకారం... 2004, ఆగస్టు21న ఢాకాలో హసీనా నేతృత్వం వహించిన అవామీ లేగ్‌ పార్టీ ఎన్నికల ప్రచార ర్యాలీలో గ్రెనేడ్‌ దాడి జరిగింది. ఈ దాడిలో 20 మంది మృతి చెందారు. 500 మందికి పైగా గాయపడ్డారు. షేక్‌ హసీనాను టార్గెట్‌ చేస్తూ గ్రేనేడ్‌ దాడి జరిగింది. బీఎన్‌పీ, జమాత్‌ ఎ ఇస్లామి కూటమికి చెందిన సభ్యులే ఈ ఘాతుకానికి కుట్ర పన్నినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు అప్పట్లో హర్కత్‌ ఉల్‌ జిహాద్‌ సభ్యులు ప్రకటించుకున్నారు.