బస్సులో చెలరేగిన మంటలు 20మంది సజీవదహనం

బస్సులో చెలరేగిన మంటలు 20మంది సజీవదహనం

  పాట్నా: బీహార్‌లో ఓ బస్సు ప్రమాదంలో 20 మంది సజీవ దహనమయ్యారు. ముజఫర్‌నగర్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన ప్రైవేటు ఏసీ బస్సు తూర్పు చంపారన్ జిల్లా మోతీహరి ప్రాంతంలో గురువారం ఘోర ప్రమాదానికి గురైంది. 32మందితో ప్రయాణిస్తున్న బస్సు బేల్వా గ్రామం వద్ద 28వ నెంబరు జాతీయ రహదారిపై కల్వర్టును ఢీకొని అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కనీసం 20మంది ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర రవాణా మంత్రి దినేశ్ యాదవ్ తెలిపారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఎక్కువగా మహిళలు, పిల్లలు ఉన్నట్లు తెలుస్తున్నది.

వీరిలో అత్యధికులు ముజఫర్‌పూర్ వాసులేనని సమాచారం. ఎదురుగా వస్తున్న ఓ ద్విచక్రవాహనాన్ని తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు. కేవలం ఐదుగురు మాత్రమే గాయాలతో బయటపడ్డారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని డీఎస్పీ మురళీమనోహర్ మాంఝి తెలిపారు.