భారత్ చేరుకున్న రష్యా అధ్యక్షుడు...

భారత్ చేరుకున్న రష్యా అధ్యక్షుడు...

 న్యూఢిల్లీ: రెండురోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం భారత్‌లో అడుగుపెట్టారు. శుక్రవారం ఢిల్లీలో జరిగే ఇండియా-రష్యా 19వ వార్షిక ద్వై పాక్షిక సమావేశానికి ప్రధాని మోదీతో కలిసి ఆయన హాజరవుతారు. రక్షణరంగ సహకారం పై కీలక చర్చలతోపాటు, ఎస్-400 క్షిపణి నిరోధక వ్యవస్థ కొనుగోలుపై ఇరుదేశాల మధ్య భారీ ఒప్పందం ఖరారు కానున్నది. రష్యాపై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ ఒప్పందంపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొన్నది. ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో కలిసి వచ్చిన పుతిన్ గురువారం సాయంత్రం 6.30గంటలకు ఢిల్లీలోని పాలెం విమానాశ్రయానికి చేరుకున్నారు. భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఆయనకు ఘనస్వాగతం పలికారు. రాత్రి ఏడుగంటల ప్రాంతంలో పుతిన్.. లోక్‌కల్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని మోదీ అధికారిక నివాసానికి చేరుకున్నారు. పుతిన్‌కు సాదరంగా స్వాగతం పలికిన మోదీ..ఆయన కోసం ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు.

నేతలిద్దరూ విందు సందర్భంగా మర్యాదపూర్వకంగా మాట్లాడుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. అంతకుముందు రష్యన్, ఇంగ్లిష్ భాషల్లో ట్వీట్ చేసిన మోదీ.. భారత్‌లో అడుగుపెట్టిన ప్రెసిడెంట్ పుతిన్‌కు స్వాగతం.. భారత్-రష్యా స్నేహాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే మన చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని అన్నారు. శుక్రవారం ఉదయం 11గంటలకు హైదరాబాద్ హౌజ్‌లో పుతిన్, మోదీ మధ్య విస్తృత చర్చలు జరుగనున్నాయి. ఈ సమావేశంలోనే కీలక ఎస్-400 క్షిపణి నిరోధక వ్యవస్థలతోపాటు, 4 క్రివాక్ యుద్ధనౌకల కొనుగోలు ఒప్పందాలు ఖరారు కానున్నాయి.