భారత్‌, చైనా సైనిక సహకారం బలోపేతం

భారత్‌, చైనా సైనిక సహకారం బలోపేతం

  న్యూఢిల్లీ : భారత్‌, చైనాల మధ్య సైనిక సహకారం మరింత బలోపేతం కానుంది. ఇరు దేశాల మధ్య సరిహద్దు పొడవునా శాంతియుత పరిస్థితులను కొనసాగించేందుకు ఉభయ పక్షాలు నిర్ణయించాయి. భారత్‌లో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన చైనా స్టేట్‌ కౌన్సిలర్‌, రక్షణ మంత్రి వాయి ఫెంగె మంగళవారం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. జిన్‌పింగ్‌, మోడీ మార్గనిర్దేశకంలో ఇరు దేశాల సైన్యాల మధ్య సహకారం మరింత పటిష్టమయ్యేందుకు చర్యలు తీసుకుంటామని ఫెంగె తెలిపారు. స్నేహపూర్వకమైన సహజీవనం, సహకారం లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పారు. 

ఇప్పటికే ఇరువురు నేతల మధ్య కుదిరిన కీలకమైన ఏకాభిప్రాయాన్ని అమలు చేయడానికి ఈ పర్యటన ఎంతగానో దోహదపడనుంది. అలాగే సైనిక, భద్రతాపరమైన మార్పిడులు, సహకారం, పరస్పర విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందన్నారు. ఇరు దేశాల మధ్య ఉమ్మడి ప్రయోజనాలు చాలా వున్నాయని మోడీ అన్నారు. ఒకరికొకరం సహకరించుకుంటూ, భవిష్యత్‌ కోసం ఉమ్మడిగా ప్రణాళికలు వేసుకోవాలని ఆకాంక్షించారు. ఇరు దేశాల సైన్యాల మధ్య పరస్పర మార్పిడులు జరగాలని, సహకారం పెరగాలని, సరిహద్దుల్లో సుస్థిరత కొనసాగేలా కృషి చేయాలన్నారు.