భారత్‌-దక్షిణ కొరియాల మధ్య నాలుగు ఒప్పందాలు!

భారత్‌-దక్షిణ కొరియాల మధ్య నాలుగు ఒప్పందాలు!

  న్యూఢిల్లీ : భారత్‌-దక్షిణ కొరియాలు మంగళవారం నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించాయి. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం భారత్‌కు చేరుకున్నారు. ఆ మరుసటి రోజైన సోమవారం నొయిడాలో నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్‌ ఫ్యాక్టరీ అయిన శాంసంగ్‌ ఫోన్‌ తయారీ కర్మాగారాన్ని ప్రారంభించారు. అనంతరం మంగళవారం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ మూన్‌ జేను ప్రశంసించారు. కొరియా ద్వీపకల్పంలో శాంతి ప్రక్రియను వేగవంతం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. 

మూన్‌ ప్రయత్నం వల్లే కొరియా ద్వీపకల్పంలో సానుకూల వాతావరణం నెలకొన్నదని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు ఇద్దరు నేతల సమక్షంలో జరిగిన ప్రతినిధి స్థాయి సమావేశంలో నాలుగు ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్‌ తన వంతు సహకారాన్ని అందిస్తుందని మోడీ చెప్పారు. సంప్రదింపులు, సహకార స్థాయిని పెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భారత్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పించిన దక్షిణ కొరియాకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌లోని ప్రతి ఇంటిలో కూడా కొరియా ఉత్పత్తులు బాగా గుర్తింపు పొందాయన్నారు. ఆ కంపెనీల నిబద్ధతే గుర్తింపునకు కారణమని చెప్పారు. భారత్‌ చేపట్టిన మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమంలో దక్షిణ కొరియా భాగస్వామ్యం పలు ఉద్యోగ అవకాశాలు కల్పించాయన్నారు.