భారత్‌, రష్యాల మధ్య మూడు సైనిక ఒప్పందాలు

భారత్‌, రష్యాల మధ్య మూడు సైనిక ఒప్పందాలు

 న్యూఢిల్లీ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ గురువారం న్యూఢిల్లీ చేరుకున్నారు. భారత్‌-రష్యా వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఇక్కడకు వచ్చారు. ఈ పర్యటనా సమయంలో ఇరు దేశాల మధ్య 1000కోట్ల డాలర్ల విలువైన సైనిక ఒప్పందాలు కుదురుతాయని భావిస్తున్నారు. శుక్రవారం మూడు ముఖ్యమైన సైనిక ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయి. రు.39వేల కోట్ల విలువ చేసే ఐదు ఎస్‌-400 క్షిపణి వ్యవస్థల సరఫరా, నాలుగు స్టెల్త్‌ యుద్ధ విమానాల కొనుగోలు, ఎకె-103 అసాల్ట్‌ రైఫిల్స్‌ను భారత్‌లో తయారుచేసే ఒప్పందాలు చేసుకోనున్నారు. అయితే ఈ ఒప్పందాల పట్ల అమెరికా చాలా తీవ్రంగా స్పందించింది. సిఎఎటిఎస్‌ఎ చట్టం (ఆంక్షలతో అమెరికా వ్యతిరేకులను ఎదుర్కొనే చట్టం)కింద ఆంక్షలు విధించే అవకాశం వుందని హెచ్చరించింది. 

రష్యా, ఇరాన్‌, ఉత్తర కొరియాల నుండి రక్షణ పరికరాలు కొనుగోలు చేయడాన్ని ఈ చట్టం నిషేధిస్తోంది. అయితే అటువంటి ఆంక్షలు ఏవీ లేకుండా చూసేలా అమెరికా ప్రభుత్వంతో భారత్‌ చర్చలు జరుపుతోంది. కానీ, అమెరికా అధికారులు మాత్రం స్పష్టమైన సంకేతాలు వెలువరించడం లేదు. గత నెల్లో చైనా ఎస్‌యు-35 యుద్ధ విమానాలను, ఎస్‌-400 క్షిపణి వ్యవస్థలను తీసుకోవడం ప్రారంభించడంతో చైనాపై ట్రంప్‌ ప్రభుత్వం ఆంక్షలను విధించింది. శుక్రవారం పుతిన్‌, మోడీ 'వర్కింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌' చేయనున్నారు. అనంతరం ప్రతినిధి బృందం స్థాయి చర్చలు జరుగుతాయి. మొత్తంగా23 ఒప్పందాలపై ఇరువురు నేతలు సంతకాలు చేస్తారని భావిస్తున్నారు. పెట్టుబడుల ఒప్పందాలపై అవగాహన, రోదసీ సహకారం, రహదారి రవాణా, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వంటి అంశాలపై ఒప్పందాలు జరగనున్నాయి.