భారత్‌బంద్‌కు అనూహ్యమైన స్పందన

భారత్‌బంద్‌కు అనూహ్యమైన స్పందన

 న్యూఢిల్లీ : దేశంలో ఇంధన ధరలు పెరగడంతో పాటు రూపాయి విలువ తగ్గుముఖం పట్టడంతో కాంగ్రెస్‌, వామపక్షాలు నేతృత్వంలోని చేపట్టిన ఈ బంద్‌లో కనీసం 21 ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి. రాజ్‌ఘాట్‌ నుండి రామ్‌లీలా మైదానం వరకు సాగిన నిరసనల్లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. శరద్‌ పవార్‌, ఎంకె స్టాలిన్‌ వంటి ప్రతిపక్ష నేతలు బంద్‌కు మద్దతునిచ్చారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం పిలుపునిచ్చిన హర్తాళ్‌కు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమౌతున్నాయి. కన్నూర్‌ జిల్లాలో రాష్ట్ర బస్సు సర్వీసులను నిలిపివేశారు. అక్కడి ప్రభుత్వ కార్యాలయాలపై కూడా ఈ బంద్‌ ప్రభావం కనిపించింది.

గుజరాత్‌లో భారత్‌బంద్‌లో భాగంగా నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యే ఇమ్రాన్‌ ఖేదావాలాతో సహా పలువురు కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్ద యెత్తున ఆందోళనలు చేపట్టారు. జైపూర్‌లో కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహారాష్ట్రలో ముంబయి, పుణెల్లో వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. అక్కడక్కడ చిన్నపాటి ఆందోళనలు చోటుచేసుకున్నాయి. టైర్లకు నిప్పంటించడం,బస్సులపై రాళ్లదాడి జరిగింది. పశ్చిమబెంగాల్‌లోని మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఈ బంద్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించింది. కైలాష్‌ మానసరోవర్‌ యాత్ర నుండి తిరిగి వచ్చిన తరువాత రాహుల్‌గాంధీ మొట్టమొదటి బహిరంగ ప్రదర్శనలో పాల్గొన్నారు. సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కూడా రాజధానిలో జరిగిన నిరసనలలో పాల్గొన్నారు.

కర్ణాటకలో జనతాదళ్‌ సెక్యూలర్‌ - కాంగ్రెస్‌ కూటమి నిరసనలు వ్యక్తం చేస్తుంది. పలు చోట్ల రోడ్డు సర్వీసులు నిలిచిపోయాయి. పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఉబెర్‌, ఓలా డ్రైవర్‌ గ్రూపులు, ఆటో డ్రైవర్స్‌ అసోసియేషన్‌, కర్ణాటక రాఖీనా వేదికే వంటి ఇతర సంస్థలు భారతబంద్‌ నిరసనల్లో పాల్గొన్నాయి. ఒడిశాలో కూడా పాఠశాలలు మూతపడ్డాయి. ఈ చర్యను ముఖ్యమంత్రి నవీన్‌పట్నాయక్‌ తిరస్కరించారు. ఎటువంటి విధ్వంస కాండకు తావున్వికూడదని కాంగ్రెస్‌ కార్యకర్తలు పార్టీ సూచించింది. తమిళనాడులో డిఎంకె నాయకుడు ఎం.కె.స్టాలిన్‌ మాట్లాడుతూ డాలర్‌తో రూపాయి విలువను అడ్డుకునేందుకు, ఇంధన ధరలు నియంత్రించేందుకు కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. డీజిల్‌, పెట్రోల్‌ ధరలను జిఎస్‌టిలోకి చేర్చాలని కాంగ్రెస్‌ పార్టీ నేత రణదీప్‌ సూర్జేవాలా డిమాండ్‌ చేశారు.