బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం

బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం

బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీహార్ లోని అఖురహా గ్రామం పనాపూర్ అవుట్ పోస్టు దగ్గర DSP కృష్ణ మురారీ ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసుల పైకి మోతిహారి వైపు నుంచి వేగంగా వచ్చిన ఓ భారీ వాహనం నేరుగా పోలీసులపైకి దూసుకొచ్చింది.ఈ సంఘటనలో ఐదుగురు పోలీసులు అక్కడికక్కడే చనిపోయారు. మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడినవారిలో ఓ డీఎస్పీ, ఓ ఇంచార్జీ పోలీసు అధికారి, కానిస్టేబుళ్లు ఉన్నారు. పోలీసుల వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. ప్రమాదానికి కారణమైన వాహనం డ్రైవర్‌ పరారయ్యాడు.

మొదట ఓ పోలీసు కారును ఢీకొట్టగా అది గాల్లో లేచి 40 అడుగుల దూరంలో పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ వెంటనే నేరుగా పోలీసులపైకి వెళ్లడంతో ఐదుగురు పోలీసులు అక్కడి కక్కడే చనిపోయారు. గాయపడిన డీఎస్పీ కృష్ణ మురారీ ప్రసాద్, పనాపూర్ అవుట్ పోస్టు ఇన్ చార్జీ డీఎన్ ఝా ను ముజఫర్‌ నగర్‌ ఆస్పత్రికి తరలించారు స్థానికులు.

విషయం తెలుసుకున్న సీనియర్ సూపరింటెండెంట్ వివేక్ కుమార్, జిల్లా మెజిస్ట్రేట్ ధర్మేంద్ర సింగ్ ఘటనా స్థలానికి చేరుకుని యాక్సిడెంట్ వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదం ఓవర్ స్పీడ్ వల్ల జరిగిందా,  డ్రైవర్ నిద్రమత్తే కారణమా అనే దానిపై దర్యాప్తు చేపట్టారు.