బ్రహ్మోస్ యూనిట్‌లో.. ఐఎస్‌ఐ ఏజెంట్ అరెస్టు

బ్రహ్మోస్ యూనిట్‌లో.. ఐఎస్‌ఐ ఏజెంట్ అరెస్టు

 నాగపూర్: ఉత్తరప్రదేశ్ పోలీసులు గూఢచర్యం కేసులో నిషాంత్ అగర్వాల్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. నాగపూర్‌లోని బ్రహ్మోస్ యూనిట్‌లో అతను పనిచేస్తున్నాడు. పాకిస్థాన్‌కు అక్రమంగా సమాచారం చేరవేస్తున్న కేసులో అతన్ని పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రర్ స్కాడ్.. నిషాంత్ అగర్వాల్‌ను బ్రహ్మోస్ యూనిట్‌లో అరెస్టు చేసింది. బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించిన సాంకేతిక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నట్లు నిషాంత్‌పై ఆరోపణలు ఉన్నాయి. అతను ఐఎస్‌ఐ ఏజెంట్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్‌లో గత నాలుగేళ్ల నుంచి అతను పనిచేస్తున్నాడు. అఫిషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద అతన్ని అరెస్టు చేశారు. గత నెలలోనూ యూపీ ఏటీఎస్ పోలీసులు ఓ బీఎస్‌ఎఫ్ జవానును అరెస్టు చేశారు. ఆ జవాను పాక్ ఐఎస్‌ఐ ఏజెంట్లకు సమాచారం చేరవేస్తున్నట్లు గుర్తించారు.