బుర్ఖా ధరించే హక్కును తిరస్కరించొద్దు

బుర్ఖా ధరించే హక్కును తిరస్కరించొద్దు

 న్యూఢిల్లీ: విద్యార్థులు, అభ్యర్థులు తమ మత ఆచారాలకు అనుగుణంగా దుస్తులు ధరించి(బుర్ఖా), వస్తువుల(సిక్కులు వెంటపెట్టుకునే కిర్పాన్‌)ను కలిగి ఉండి పరీక్షలు, నియామక ప్రక్రియల్లో పాల్గొనేందుకు అనుమతించాలని ఢిల్లీ ప్రభుత్వ శాఖలకు మైనారిటీ కమిషన్‌ ఆదేశాలు జారీచేసింది. ముస్లిం మహిళలు హిజబ్‌ను ధరించే హక్కును తిరస్కరించరాదని ఆ ఉత్తర్వుల్లో కమిషన్‌ పేర్కొంది. అలాగే చట్ట నిబంధనల మేరకు సిక్కులు కిర్పాన్‌(చిన్న కత్తి)ను కలిగి ఉండటాన్నీ అనుమతించాలని తెలిపింది. అలాగే పరీక్షల సమయంలో ముస్లిం మహిళల హిజబ్‌ను భద్రత సిబ్బంది తనిఖీలు చేయవచ్చునని, అయితే భద్రతకు సంబంధించిన తనిఖీల గురించి మైనార్టీ విద్యార్థులకు, అభ్యర్థులకు ముందస్తుగానే సమాచారమివ్వాలని సూచించింది.

ఈ ఆదేశాలను అమలు చేయాల్సిందిగా.. ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలకు కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. లేని యెడల చట్టబద్ధ చర్యలను ఎదుర్కోవలసి ఉంటుందని తెలిపింది. కాగా, కమిషన్‌ ఉత్తర్వులకు అనుగుణంగా జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌.. ప్రిన్సిపల్‌ సెక్రెటరీలకు, శాఖాధిపతులకు సర్క్యూలర్‌ జారీ చేసింది. పరీక్షలకు హాజరయ్యేటప్పుడు మతపరమైన వస్తువులను బలవంతంగా త్యజించాల్సి వస్తున్నదన్న మైనారిటీ వర్గీయుల ఫిర్యాదుల మేరకే ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టు మైనార్టీ కమిషన్‌ చైర్మెన్‌ జాఫరుల్‌ ఇస్లాం ఖాన్‌ వివరించారు.