చనిపోయిందనుకున్న పాప బతికే ఉంది

చనిపోయిందనుకున్న పాప బతికే ఉంది

 న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని కేంద్ర ప్రభుత్వ దవాఖాన సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ మచ్చు తునక. అప్పుడే పుట్టిన ఓ పాప ఊపిరి తీసుకోవడం లేదని చెప్పి ఆమెను మరణించినట్టుగా ధ్రువీకరించి తల్లిదండ్రులకు అప్పజెప్పిన ఘటన ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ దవాఖానలో చోటు చేసుకుంది. బదర్‌పూర్‌కు చెందిన ఓ మహిళ పూర్తిగా నెలలు నిండకముందే ఓ పాపకు జన్మనిచ్చింది. అయితే ఆ పాప ఊపిరితీసుకోవడం లేదని గుర్తించిన నర్సింగ్ సిబ్బంది చిన్నారి మరణించినట్టుగా ధ్రువీకరించారు. ఆ శిశువును ఓ డబ్బాలో ప్యాక్ చేసి, మరణించిందని ముద్రవేసి తండ్రి రోహిత్ చేతికి అప్పగించారు. 


పాపను ఇంటికి తీసుకెళ్లి సమాధి చేయడానికి సిద్ధపడుతుండగా, డబ్బాలో అలికిడి కావడం రోహిత్ సోదరి చూసింది. వెంటనే డబ్బాకు వేసిన సీలు విప్పి చూడగా పాప ఊపిరి తీసుకుంటూ కాళ్లూ, చేతులూ కదుపుతూ కనిపించింది. వెంటనే అంబులెన్స్‌లో మళ్లీ దవాఖానకు తరలించి చికిత్సనందిస్తున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని సఫ్దర్‌జంగ్ దవాఖాన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏకే రాయ్ చెప్పారు.