న్యూఢిల్లీ : హాయ్.. హలో.. బాగున్నారా! అంటూ ఫేస్బుక్లో ఓ అందమైన మహిళ చాటింగ్ చేస్తూ భారత సైనిక రహస్యాల్ని కాజేసింది. తన అందమైన నవ్వుతో, కవ్వింపు మాటలతో ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఏకంగా 50 మంది సైనికుల్ని బురిడీ కొట్టించింది. ఫేస్బుక్లో ఎప్పటికప్పుడు తన ఫొటోలను పోస్టు చేస్తూ, సందేశాలు పంపుతూ జవాన్లను ఆకర్షిస్తూ వారి నుంచి రక్షణ సమాచారాన్ని కొల్లగొట్టింది. ఈ వగలాడి మాటలకు బోల్తాపడిన ఓ సైనికుడు భారత సైనిక రహస్యాల్ని ఒక్కొక్కటిగా చెప్పుకొంటూ పోయాడు. హనీ ట్రాపింగ్ (వలపు వల)గా పిలిచే ఈ ప్రక్రియలో తీగలాగితే డొంకంతా కదిలిన చందంగా గుట్టు రట్టయింది. ఇదంతా పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కుట్ర అని, అనికా చోప్రా పేరుతో నకిలీ ఖాతాను సృష్టించి జవాన్లను ఉచ్చులోకి దించారని గుర్తించారు. సైనిక రహస్యాల్ని చేరవేసిన సిపాయి సోమ్వీర్సింగ్ను శనివారం రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు.
తన పేరు అనికా చోప్రా అని, సైన్యంలోని నర్సింగ్ కార్ప్స్కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నానంటూ ఓ మహిళ పేరుతో 2016లో హర్యానాకు చెందిన సిపాయి సోమ్వీర్సింగ్కు ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. రాజస్థాన్‌లోని జైసల్మేర్ స్థావరంలో సిపాయిగా సోమ్‌వీర్ విధులు నిర్వర్తిస్తున్నాడు. సంప్రదాయ చీరకట్టులో, నవ్వులు రువ్వుతున్న అనికా చోప్రా ఫొటోను చూసి సోమ్‌వీర్ ఫిదా అయిపోయాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఫేస్బుక్ సాక్షిగా స్నేహం మొగ్గ తొడిగింది. తొలుత కుశల ప్రశ్నలు, ముచ్చట్లతో మొదలై నెమ్మదిగా ఈ వ్యవహారం శృంగారపరమైన చర్చల వరకు వెళ్లింది. ఇక ఇక్కడి నుంచి అనికా చోప్రా క్రమంగా తన ప్లాన్‌ను ఆచరణలో పెట్టింది.
ప్రస్తుతం మీరు ఎక్కడ పనిచేస్తున్నారు? మీ ఆర్మీ యూనిట్‌కు సంబంధించిన మ్యాప్, వాహనాలు, ఆయుధాలకు సంబంధించిన చిత్రాలు ఉంటే పంపించు.. మీ యుద్ధ ట్యాంకులకు సంబంధించిన ఫొటోలు ఉంటే పంపిస్తావా? ఫీల్డ్ ఫైరింగ్‌ను ఎప్పుడు నిర్వహిస్తారు? సైనిక విన్యాసాల చిత్రాలు పంపించు.. అంటూ సోమ్‌వీర్‌కు వరుసగా సందేశాలు పంపింది. అప్పటికే పూర్తిగా అనికా చోప్రా ఆధీనంలోకి వెళ్లిపోయిన సోమ్‌వీర్ ఆర్మీ రహస్యాల్ని ఒక్కొక్కటిగా చేరవేశాడు. ఇతర స్థావరాల వివరాలు, ఫొటోలు కావాలని కూడా ఆమె అడిగింది. అలాగే భార్యను వదిలిపెట్టి తనను పెండ్లి చేసుకోవాలంటూ సోమ్‌వీర్‌పై ఒత్తిడి పెంచింది. పలు సందర్భాల్లో అతడిని బెదిరించే ప్రయత్నం చేసింది. కొంతకాలంగా సోమ్‌వీర్ ప్రవర్తన తేడాగా ఉండడం, ఎక్కువ సేపు సోషల్‌మీడియాలో చాటింగ్ చేస్తుండడంతో అనుమానం వచ్చిన తోటి జవాన్లు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిఘా వర్గాలు, రాజస్థాన్‌కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక దళం సోమ్‌వీర్‌పై ఐదు నెలలుగా నిఘా పెట్టింది. అతడి ఫేస్బుక్ ఖాతాలను పరిశీలించి నిర్ఘాంతపోయింది. అనికా చోప్రా పేరుతో ఆర్మీలో ఏ అధికారిణి లేరని, ఇది పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ పని అని తేలింది. పాక్‌లోని కరాచీ నుంచి ఐఎస్ఐ ఈ రాకెట్‌ను ఆపరేట్ చేసిందని గుర్తించారు. ఆర్మీ రహస్యాల్ని చేరవేసినందుకు ఐఎస్ఐ సోమ్‌వీర్‌కు రూ.5వేలు అందజేసిందని, కానీ, ఆ నగదును ఎవరికీ అనుమానం రాకుండా సోమ్‌వీర్ తన సోదరుడి ఖాతాలో వేయించినట్లు తేలింది. అనంతరం నిఘావర్గాలు, ఏటీఎస్ పోలీసులు సోమ్‌వీర్‌ను అరెస్టు చేశారు. అయితే, తాను ఆర్మీకి సంబంధించిన ఎలాంటి సమాచారం అందజేయలేదని సోమ్‌వీర్ వాపోయాడు. మరోవైపు మరో 50 మంది జవాన్లకు కూడా ఐఎస్ఐ అనికా చోప్రా పేరుతో వల వేసిందని తేలడంతో ఆర్మీ నిర్ఘాంతపోయింది. అనికా చోప్రా పంపిన సందేశాలు, ఫొటోలకు 50 మంది జవాన్లు లైక్ చేసినట్లు, కొందరు కామెంట్లు చేసినట్లు గుర్తించారు. వీరిని కూడాత్వరలో ప్రశ్నించనున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. శనివారం సోమ్‌వీర్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా జనవరి 18 వరకు అతడికి కస్టడీ విధించినట్లు పోలీసులు చెప్పారు. మరోవైపు హనీ ట్రాపింగ్ వివాదం నేపథ్యంలో బలగాలకు సైన్యం గట్టి హెచ్చరికలు చేసింది. సోషల్ మీడియాలో తమ ర్యాంకు, పనిచేస్తున్న ప్రదేశం, తమ గుర్తింపునకు సంబంధించిన చిత్రాలను, సమాచారాన్ని సైనికులు, అధికారులు ఎవరూ పోస్టు చేయరాదని ఆదేశించింది.