కాంగో అధ్యక్షుడిగా ప్రతిపక్ష నేత షెలిక్స్‌ విజయం

కాంగో అధ్యక్షుడిగా ప్రతిపక్ష నేత షెలిక్స్‌ విజయం

 కిన్షాసా : కాంగోలో ఎన్నాళ్ళగానో జాప్యం జరుగుతూ వస్తున్న అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష నేత ఫెలిక్స్‌ త్సిషెకెది గెలుపొందినట్లు ఎన్నికల కమిషన్‌ గురువారం ప్రకటించింది. కాగా ఈ ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలకు సమాయత్తమవుతున్నారు. మాజీ ప్రతిపక్ష నేత ఎటిన్నె కుమారుడైన ఫెలిక్స్‌కు 38శాతం ఓట్లు అంటే 70లక్షలకు పైగా ఓట్లు వచ్చినా ఆధిక్యతలో వుండే అభ్యర్ధిగా ఆయనను ఏనాడు పరిగణించలేదు. పాలక పార్టీ అభ్యర్ధి ఎమ్మాన్యుయెల్‌ రమజాని షెడారికి 40లక్షల ఓట్లు అంటే 23శాతం ఓట్లు వచ్చాయి. పాలక పార్టీ అభ్యర్ధి గెలుపు సాధించే అవకాశాలు లేకపోవడంతో ఒప్పందం కుదుర్చుకోవాలని అధ్యక్షుడు జోసెఫ్‌ కబిలా ప్రభుత్వం భావిస్తున్నట్లు కొంతమంది పరిశీలకులు తెలిపారు. 

అయితే, కాంగోలో విస్తృతంగా పాతుకుపోయిన అవినీతిని ప్రక్షాళన చేస్తానని ప్రతిజ్ఞ చేసిన ప్రతిపక్ష అభ్యర్ధి మార్టిన్‌ ఫయులూ ఈ ఫలితాలను సవాలు చేస్తారా లేదా అనేది వెంటనే తెలియరాలేదు. ఈ ఫలితాలను సవాల్‌ చేయడానికి రాజ్యాంగ కోర్టు 14రోజుల గడువు ఇచ్చింది. ఫయులూకు 60లక్షల కోట్లు లేదా 34శాతం ఓట్లు వచ్చాయి. 1960 తర్వాత కాంగోలో ఇంత ప్రశాంతంగా అధికార బదిలీ ప్రజాస్వామ్యబద్ధంగా జరగడం ఇదే ప్రధమం. కాగా, త్సిషెకెది పార్టీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు అంబరాన్నంటాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత ఎన్నికల ఫలితాలను ప్రకటించడంతో వందలాదిమంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నృత్యాలు, సంబరాలు చేసుకున్నారు.,