కాంగ్రెస్‌తో కలిస్తే మీటూ అనాల్సిందే...

కాంగ్రెస్‌తో కలిస్తే మీటూ అనాల్సిందే...

  హైదరాబాద్ : కాంగ్రెస్‌తో జతకట్టేందుకు ఉత్సాహం చూపుతున్న పార్టీలు ఎన్నికల అనంతరం మీటూ ఉద్యమం చేయాల్సి వస్తుందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఎద్దేవాచేశారు. రాఫెల్ ఒప్పందం విషయంలో చేస్తున్న విమర్శల ద్వారా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఫెయిల్ అయ్యారని వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్‌లోని పరేడ్ మైదానంలో నిర్వహించిన బీజేవైఎం విజయలక్ష్య-2019 యువ మహాదివేశన్ సదస్సులో ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. దేశంలో మార్పు యువత వల్లనే సాధ్యం అవుతుందన్నారు. భగత్‌సింగ్ కలలుగన్న సుపరిపాలనను మోదీ సర్కార్ అందిస్తున్నదని చెప్పారు. జాతిహితం కన్నా రాజకీయహితమే కాంగ్రెస్ కోరుకొంటున్నదని, స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్‌ను రద్దుచేయాలన్న గాంధీ మాటలు చెవిన పెట్టలేదని తెలిపారు. 

మోదీని ఓడించడం మినహా విపక్షాలకు మరోఎజెండా లేదని, అన్నిపక్షాలు ఒక్కటైనా కూడా మోదీని, బీజేపీని ఆపలేవన్నారు. దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని, ఇప్పుడు కాంగ్రెస్‌తో వెళ్లే పార్టీలు ఎన్నికల తర్వాత మీటూ ఉద్యమం చేయాల్సిందేనని ఎద్దేవాచేశారు. ఆరునెలలపాటు ఇండ్లను వీడి 350 సీట్లు గెలిచేంతవరకు కార్యకర్తలు నిద్రపోవద్దని సూచించారు. మరో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. పెట్రోల్ ధరల పెరుగుదలతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని, పెట్రోల్ ఉత్పత్తిచేసే దేశాలపై అంతర్జాతీయ ఒత్తిళ్లే కారణమన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. బయోఎనర్జీ, సోలార్ ఎనర్జీ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామని చెప్పడం ద్వారా పెట్రో ఉత్పత్తి దేశాలపై ఒత్తిడి తెస్తున్నట్టు వెల్లడించారు. వేల గ్రామాలకు విద్యుత్ కూడా ఇవ్వనివారు మోదీని ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు.