సిఆర్‌పిఎఫ్‌ వాహనంపై రాళ్లురువ్విన ఆందోళనకారులు

సిఆర్‌పిఎఫ్‌ వాహనంపై రాళ్లురువ్విన ఆందోళనకారులు

  శ్రీనగర్‌ : స్థానిక జామియా మసీదు వెలుపల శుక్రవారం రాత్రి తలెత్తిన ఘర్షణల్లో సిఆర్‌పిఎఫ్‌ వాహనం ఢీ కొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 18 రోజుల క్రితం కేంద్రం కాశ్మీర్‌లో కాల్పులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం ఒక వ్యక్తి మృతిచెందడం ప్రథమమని పేర్కొన్నారు. శుక్రవారం మసీదులో ప్రార్థనల అనంతరం ఘర్షణలు చెలరేగాయి. దీంతో కొందరు వ్యక్తులు సిఆర్‌పిఎఫ్‌ వాహనంపై రాళ్లు రువ్వారు. 

దీంతో వాహనాన్ని ఆపకుండా డ్రైవర్‌ ముందుకు తీసుకువెళ్లడంతో స్థానిక ఫతే-ఎ-కాడల్‌కు చెందిన కైసర్‌ భట్‌ అనేవ్యక్తి వాహనం చక్రాల కింద పడిపోవడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అతనిని ఎస్‌ఐఎమ్‌ఎస్‌లో చేర్పించి వైద్య చికిత్సను అందించామని, అయితే తీవ్ర గాయాలవడంతో అతను మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. గతవారం తలెత్తిన ఘర్షణల నేపథ్యంలో ఈ వారం భద్రతా సిబ్బందిని తొలగించినట్లు సిఆర్‌పిఎఫ్‌ అధికారి సంజరు శర్మ పేర్కొన్నారు. అయినా సిఆర్‌పిఎఫ్‌ వాహనంపై కొందరు వ్యక్తులు దాడికి దిగారని అధికారి తెలిపారు. ఈరెండు ఘటనలపై కేసు నమోదుచేశామని పోలీసులు తెలిపారు.