క్యూబాలో పర్యటించనున్న రాష్ట్రపతి కోవింద్‌

క్యూబాలో పర్యటించనున్న రాష్ట్రపతి కోవింద్‌

  న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ వారాంతరంలో క్యూబాలో కూడా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన క్యూబా అధక్షుడు మిగుయెల్‌ డియాజ్‌ కానెల్‌తో చర్చలు జరపటంతో పాటు బయోటెక్నాలజీ, సంప్రదాయక, ప్రత్యామ్నాయ వైద్య సేవల వంటి అంశాలకు సంబంధించి కొన్ని ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారని భారత విదేశాంగశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారత విదేశాంగశాఖలో లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాల వ్యవహారాలను చూస్తున్న ఉప కార్యదర్శి పార్థ శతపథి బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ క్యూబాలో తొలిసారి జరుపుతున్న ఈ పర్యటన భారత్‌ ఈ ఏడాది లాటిన్‌ అమెరికా దేశాలతో సంబంధాలకు ఇస్తున్న అత్యధిక ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుందన్నారు. దక్షిణార్థ గోళంలో సహకారానికి సంబంధించి భారత్‌-క్యూబా ప్రధాన భాగస్వాములని ఆయన అభివర్ణించారు.

రాష్ట్రపతి కోవింద్‌ తన పర్యటనలో క్యూబా ప్రస్తుత అధ్యక్షుడు మిగుయెల్‌ డియాజ్‌ కానెల్‌తో భేటీ అవుతారన్నారు. కానెల్‌ గతంలో క్యూబా ఉపాధ్యక్షుడి హోదాలో 2015లో భారత్‌లో పర్యటించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారత్‌ క్యూబా సంబంధాలు సంప్రదాయకంగా స్నేహపూర్వకమైనవని, చారిత్రకమైనవని అన్నారు. రాష్ట్రపతి తన విదేశీ పర్యటనలో భాగంగా ఈ నెల 16న గ్రీస్‌కు చేరుకుంటారు. అక్కడి నుండి సురినామ్‌ వెళ్లి, చివరిగా హవానా చేరుకుంటారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి వెంట కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి విష్ణుదేవ్‌ సాయి, లోక్‌సభ సభ్యులు దినేష్‌ కాశ్యప్‌, నిత్యానంద్‌ రారు, కొందరు సీనియర్‌ అధికారులు పాల్గొంటారు.