ఢిల్లీలో కూలిన మూడంతస్తుల భవనం

ఢిల్లీలో కూలిన మూడంతస్తుల భవనం

 న్యూఢిల్లీ : ఢిల్లీ అశోక్‌ విహార్‌ ప్రాంతంలో బుధవారం ఉదయం మూడు అంతస్తుల భవనం కూలిన సంఘటనలో ఒక మహిళ, నలుగురు పిల్లలు మృతి చెందారు. ఏడుగురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని దీప్‌ చాంద్‌ బంధూ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వారు తెలిపారు. మృతిచెందిన మహిళను మున్నిగా గుర్తించారు. మృతి చెందిన నలుగురు పిల్లల్లో ఇద్దరు పదేళ్ళ వయస్సున్న అన్నదమ్ములు కాగా, ఐదేళ్ళ లోపు వయస్సున్న మరొక బాలుడు, మరొకరిని ఆమె సోదరిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. భవన శిధిలాల్లో మరింత మంది చిక్కుకుపోయుంటారన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాగా రెస్క్యూ బృందాలు అక్కడకు చేరుకుని అవసరమైన చర్యలు చేపట్టాయని చెప్పారు. ప్రమాదానికి సంబంధించి బుధవారం ఉదయం 9.25 గంటల సమయంలో తమకు ఫోన్‌ వచ్చిందని, వెంటనే ఆరు ఆగ్నిమాపక వాహనాలు అక్కడకు చేరుకున్నాయని ఒక అధికారి తెలిపారు. సహాయ చర్యలు చేపట్టేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు చెందిన రెస్క్యూ బృందాలు కూడా అక్కడకు చేరుకున్నాయని ఎన్‌డిఆర్‌ఎఫ్‌ ప్రతినిధి తెలిపారు. ఢిల్లీలో కూలిన భవనం 20 ఏళ్ళ క్రితం నాటిదని, అది చాలా బలహీనంగా ఉందని నార్త్‌ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన సీనియర్‌ అధికారి తెలిపారు.