డిస్టింక్షన్‌లో పాసైన గాలిబ్ గురు

డిస్టింక్షన్‌లో పాసైన గాలిబ్ గురు

 శ్రీనగర్: భారత పార్లమెంట్‌పై దాడి వ్యూహకర్త అఫ్జల్ గురు కుమారుడు గాలిబ్ గురు ఇంటర్‌లో 88శాతం మార్కులు సాధించి డిస్టింక్షన్‌లో పాసయ్యాడు. జమ్ముకశ్మీర్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవంబర్‌లో నిర్వహించిన 12వ తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేయగా గాలిబ్ గురుకు 441 మార్కులు వచ్చాయి. బోర్డు పరీక్షల్లో మొత్తం 61.44 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా ఇందులో బాలికలదే పైచేయి కావడం విశేషం. 

2001లో పార్లమెంట్‌పై దాడికి వ్యూహ రచన చేసిన అఫ్జల్‌గురుకు 2013లో మరణశిక్ష అమలు చేశారు. అతడి కుటుంబం ప్రస్తుతం బారాముల్లా జిల్లా సోపోర్‌లో నివసిస్తున్నది. ఫలితాలు వెలువడగానే కుటుంబ సభ్యులు, స్నేహితులు గాలిబ్‌ను అభినందించారు. గాలిబ్ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని తనను తాను నిరూపించుకున్నారని ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధికార ప్రతినిధి సరాహ్ హయత్ ట్విట్టర్‌లో అభినందించారు.