ఎన్నారై పెళ్లిళ్లు.. కేంద్రం కీలక నిర్ణయం

ఎన్నారై పెళ్లిళ్లు.. కేంద్రం కీలక నిర్ణయం

 న్యూఢిల్లీ: ఎన్నారై పెళ్లిళ్ల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎన్నారైతో పెళ్లి జరిగిన 48 గంటల్లో తప్పక రిజిస్టర్‌ చేయించాలనే నిబంధన తీసుకొచ్చింది. లేని పక్షంలో వారి వీసా, పాస్‌పోర్టు జారీని నిలిపేస్తామని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ బుధవారం తెలిపారు. దీనికి మందు ఎన్నారై పెళ్లి రిజిస్టర్‌కు నిర్దిష్ట కాల పరిమితి లేదు. అయితే, ఎన్నారై పెళ్లిళ్ల వ్యవహారంలో వరకట్న వేధింపులు, మహిళల హత్యోదంతాలు ఇటీవల తరచూ చోటుచేసుకుంటున్నాయి. నిందితులపై మోపిన నేరం నిరూపించడానికి, వారిని విదేశాల నుంచి రప్పించడానికి న్యాయ పరమైన సమస్యలు అనేకం ఎదురవుతున్నాయి.

48 గంటల్లో పెళ్లి రిజిస్టర్‌ చేయించడం ద్వారా కేంద్రం డాటాబేస్‌లోకి ఎన్నారై వివరాలు చేరుతాయి. తద్వారా భారత్‌కి వచ్చివెళ్లే ఎన్నారై కదలికలపై దృష్టి సారించవచ్చని మేనక తెలిపారు. వారిపై నిఘా ఉంచడం ద్వారా ఏదైనా నేరానికి పాల్పడి దేశం నుంచి పారిపోకుండా ఎన్నారైలను అడ్డుకోవచ్చని ఆమె అన్నారు. వీసా, పాస్‌పోర్టును రద్దు చేసి నేర విచారణ చేపట్టొచ్చని వివరించారు. కాగా, తాజా నిర్ణయానికి ముందు ఎన్నారై పెళ్లిని 30 రోజులలోపు రిజిస్టర్‌ చేసేలా నిబంధన రూపొందించాలని ‘లా కమిషన్‌’ మహిళా, శిశు అభివృద్ధి శాఖకు సూచించడం గమనార్హం.