ఎన్నారై వివాహాలకు ఆధార్ తప్పనిసరి

ఎన్నారై వివాహాలకు ఆధార్ తప్పనిసరి

 న్యూఢిల్లీ: భారత్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకునే ఎన్నారై వివాహాలకు ఆధార్ తప్పనిసరి చేయాలని విదేశాంగ మంత్రిత్వశాఖ నియమించిన ప్రత్యేక కమిటీ సిఫారసు చేసింది. తద్వారా ఎన్నారై భర్తలు భార్యలను వదిలిపెట్టి పారిపోవడం వంటి సమస్యలను ఎదుర్కోవచ్చని కమిటీ పేర్కొన్నది. దీంతోపాటు ఎన్నారైలను పెండ్లి చేసుకునే మహిళల హక్కుల పరిరక్షణ.. విదేశాల్లో వరకట్న వేధింపులకు, గృహహింసకు బాధితులుగా మారే మహిళలకు ఈ నిబంధన వల్ల రక్షణ లభిస్తుందని తెలిపింది. 

ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వశాఖకు గత నెల 30న కమిటీ నివేదికను సమర్పించినట్లు సంబంధితవర్గాలు వెల్లడించాయి. గృహహింసకు పాల్పడే ఎన్నారై భర్తలను భారత్‌కు అప్పగించేలా ఒప్పందాలను సవరించాలని కూడా కమిటీ సిఫారసు చేసింది. కాగా ఎన్నారైలు, విదేశాల్లో ఉండే భారతపౌరులు, భారత సంతతికి చెందిన వారిని ఆధార్‌తో అనుసంధానించే ప్రక్రియకు సంబంధించి నూతన విధానాన్ని తీసుకువచ్చేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కృషి చేస్తున్నది. ప్రస్తుతం భారతీయులకు, వీసా కలిగిన విదేశీయులు మాత్రమే ఆధార్ తీసుకోవటానికి అవకాశం ఉన్నది.