గాంధీని కళ్లద్దాలకు పరిమితం చేసాడు!

గాంధీని కళ్లద్దాలకు పరిమితం చేసాడు!

మహాత్మాగాంధీ బోధించిన దానిని అనుసరించకుండా.. ఆయనను కళ్లద్దాలకు ప్రధాని మోదీ పరిమితం చేశారని గాంధీ ముని మనుమడు గోపాలకృష్ణ గాంధీ వ్యాఖ్యానించారు. ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్ 2017 కార్యక్రమంలో చానల్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌తో ఆయన సంభాషించారు. కొత్త రాజకీయాలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య ఆశాకిరణాలని అన్నారు. 

గోపాలకృష్ణ గాంధీ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే.. ప్రధాని నరేంద్రమోదీ మహాత్మాగాంధీ పేరును కేవలం కళ్లద్దాలకు పరిమితం చేశారు. కానీ.. ఆ కళ్లద్దాలు ఆయనకు ఎందుకన్నదే ప్రశ్న. యథార్థతకు స్థానం ఉంది కాబట్టే ఆయనకు కళ్లద్దాలు అవసరం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి బీజేపీ మాట్లాడటానికీ ఇదే కారణం. సిద్ధాంతాల ఆధారంగా నడిచే రాజకీయాలు కావాలి. భారతదేశంలో గుంపేతర, కుటుంబేతర, అతివాదేతర రాజకీయాలకు మంచి అవకాశం ఉంది. 

కొన్నేండ్ల క్రితం జంతర్ మంతర్ వద్ద అన్నా హజారే, అరవింద్ కేజ్రీవాల్ తాజా ఆశను ముందుకు తీసుకువచ్చారు. కేజ్రీవాల్ తన సామర్థ్యాన్ని ఎలా నిరూపించుకుంటారో నాకు తెలియదు. కానీ.. ఆయన కొంత తాజా విశ్వాసాన్ని కల్పించారు. భారత దేశ కొత్త రాజకీయాలకు కేజ్రీవాల్, కన్హయ్యకుమార్, జిగ్నేశ్ మేవానీ ఆశలు కల్పించారు. తమ నాయకుల నుంచి భారతదేశాన్ని కాపాడేందుకు దేశం ఇటువంటి వారిని మరింత మందిని ఉత్పత్తి చేస్తుందని నమ్ముతున్నాను. 

రాజకీయాల్లోకి రాకుండా నేను భద్రంగా ఉన్నాను. రాజకీయాల్లోకి రావడం ద్వారా రాహుల్‌గాంధీ పెద్ద సాహసం చేశారు. నేను (రాహుల్) భారత ప్రధాని కాదల్చుకోలేదు. దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకువచ్చిన నా పార్టీకి జీవితాంతం సేవ చేయాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి ఒకరు ప్రధాని కావాలని కోరుకుంటున్నాను. ప్రధాని కావాలనే ఆశను నేను వదులుకుంటున్నాను అని రాహుల్‌గాంధీ దేశానికి చెప్పాలని కోరుకుంటున్నాను.