గ్లోబల్‌ వార్మింగ్‌ను అరికడితేనే మనుగడ

గ్లోబల్‌ వార్మింగ్‌ను అరికడితేనే మనుగడ

  ఐక్యరాజ్య సమితి : గ్లోబల్‌ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేసినట్లైతే సమాజంలోని అన్ని రంగాల్లో సత్వర, సుదీర్ఘకాలంలో ప్రభావం చూపగలిగే, సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయని వాతావరణ మార్పులపై ఏర్పాటైన అంతర్‌ ప్రభుత్వాల కమిటీ (ఐపిసిసి) ఒక నివేదికలో పేర్కొంది. తాజా అంచనాలతో కూడిన ఈ ప్రత్యేక నివేదికను సోమవారం విడుదల చేశారు. దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో శనివారం ఈ నివేదికను ఆమోదించారు. డిసెంబరులో పోలెండ్‌లో జరగనున్న వాతావరణ మార్పులపై సమావేశంలో ఇది కీలకమైన పత్రం కానుంది. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు పారిస్‌ ఒప్పందాన్ని ఈ సమావేశంలో ప్రభుత్వాలు సమీక్షించను న్నాయి. 

భారత్‌తో సహా 40దేశాలకు చెందిన ప్రముఖులు, సమీక్షా సంపాదకులు ఈ ఐపిసిసి నివేదికను రూపొందించారు. 'ప్రపంచవ్యాప్తంగా ఒక్క డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రత పెరిగితేనే మనం చాలా దారుణమైన పరిస్థితులను అనుభవిస్తున్నాం. సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి. అర్కిటిక్‌ సముద్రంలో మంచు కనుమరుగు అవుతోంది, ఇంకా ఇతర మార్పులు అనేకం చోటు చేసుకుంటున్నాయని' ఐపిసిసి వర్కింగ్‌ గ్రూపు ఉపాధ్యక్షుడు పాన్‌మావో ఝాయి పేర్కొన్నారు. గ్లోబల్‌ వార్మింగ్‌ను 2 డిగ్రీల సెల్సియస్‌తో పోలిస్తే 1.5 డిగ్రీలకే పరిమితం చేయడం వల్ల అనేక వాతావరణ మార్పులను మనం నివారించగలుగుతామని ఆ నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది.