హిమపాతంలో ఉత్తర భారత్‌కు తోడైన వర్షాలు

హిమపాతంలో ఉత్తర భారత్‌కు తోడైన వర్షాలు

 న్యూఢిల్లీ : ఉత్తర భారత దేశంలోని పశ్చిమ ప్రాంతాన్ని మంగళవారం మంచు కప్పివేసింది. భారీ వర్షాలు ముంచెత్తాయి. ఢిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూ కాశ్మీర్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు వర్షాలు, మంచు ప్రభావాలకు తీవ్రంగా గురయ్యాయి. ఆయా రాష్ట్రాలలో రవాణాకు అంతరాయం కలిగింది. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలోని ఎత్తైన ప్రాంతాలలో మంగళవారం తాజాగా మంచువర్షం కురిసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జమ్మూకాశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలోని పరిసర ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు, మంచు కూడా కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

ఉత్తరాఖండ్‌లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడనున్నట్లు తెలిపారు. ఈ రాష్ట్రాలతో పాటు పంజాబ్‌, హర్యానా, చండీగఢ్‌, ఢిల్లీలలో కూడా భారీ వర్షాలు కురియనున్నట్లు ఆ అధికారులు పేర్కొన్నారు. జమ్మూ డివిజన్‌తో పాటు హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, హర్యానా, చండీగఢ్‌, ఢిల్లీ, ఈశాన్య ఉత్తరప్రదేశ్‌, ఉత్తర రాజస్థాన్‌లలోని దిగువ ప్రాంతాలలో ఒడగళ్ళ వర్షం కురుస్తుందన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాలలో ఈదురు గాలులతో పాటు, ఉరుములతో కూడిన వర్షాలు కురవనున్నాయని ఆ రాష్ట్ర వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. రాజస్థాన్‌లో ఇప్పటికే తుఫాన్‌ పరిస్థితులు నెలకొన్నాయని, దీని కారణంగా ఢిల్లీతో సహా పలు ప్రాంతాలలో మంగళవారం వర్షాలు కురుస్తాయని భావిస్తున్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది.