>

హోటల్‌గదుల రేట్లపై తగ్గిన జీఎస్టీ

హోటల్‌గదుల రేట్లపై తగ్గిన జీఎస్టీ

 జీఎస్టీ పన్నుపోటునుంచి హాటళ్లు, లాటరీలకు కొంత ఉపశమనం లభించింది. ఆదివారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 17వ సమావేశంలో ఈ మేరకు పన్నురేట్లు సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. హోటళ్లలో రూ.2000 నుంచి రూ.7500 వరకు అద్దె గదుల మీద పన్నును 18శాతానికి తగ్గించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు నడిపే లాటరీలపై పన్నుశాతాన్ని లాటరీ ముఖవిలువలో 12శాతానికి తగ్గించారు. జూలై 1 నుంచి దేశవ్యాప్త ఏకీకృత పన్ను విధానం అమల్లోకి వస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి, జీఎస్టీ నిర్వాహక మండలి అధ్యక్షుడు అరుణ్‌జైట్లీ ప్రకటించారు. 

వివిధ రాష్ర్టాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో తెలంగాణ నుంచి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు హాజరై ఆరు అంశాలను సమావేశం దృష్టికి తెచ్చారు. మిషన్ భగీరథ, కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులు, బీడీ పరిశ్రమ, గ్రానైట్, చేనేత పరిశ్రమమీద పన్నుల తగ్గింపు అంశాన్ని బలంగా వినిపించారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ వీటిపై సమగ్ర నివేదిక అందిస్తే వచ్చే సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. 
 

జూలై 1 నుంచి దేశవ్యాప్త ఏకీకృత పన్ను విధానం అమల్లోకి రానుందని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టంచేశారు. ఈ విషయమై వినిపిస్తున్న వదంతులను ఆయన తోసిపుచ్చారు. జూన్30 అర్ధరాత్రి నుంచే జీఎస్టీ అమల్లోకి వచ్చేస్తుంది. జూలై 1న ఢిల్లీలో ప్రారంభ కార్యక్రమం లాంఛనంగా జరుగుతుంది అని వివరించారు. కౌన్సిల్ సమావేశం అనంతరం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. హోటల్ అద్దెగదులు, లాటరీలకు సంబంధించి వస్తు, సేవల పన్ను శ్ల్లాబ్‌లను జీఎస్టీ కౌన్సిల్ సవరించినట్టు తెలిపారు. రూ.2000 నుంచి రూ.7500 వరకు అద్దె ఉండే హోటల్ గదికి పన్ను 18శాతానికి తగ్గుతుందని, రూ.7500 ఆపైన అద్దె బిల్లింగ్ ఉన్న హోటళ్లకు యథావిధిగా 28శాతం పన్ను కొనసాగనుందని చెప్పారు.

ఇక ఆయా రాష్ర్టాల్లో ప్రభుత్వం నడుపుతున్న లాటరీలకు లాటరీ ముఖవిలువలో 12శాతం జీఎస్టీని విధిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఆమోదంతో నడిచే ప్రైవేటు లాటరీలకు మాత్రం 28శాతం పన్నును ఖరారు చేశారు. ఎలక్ట్రానిక్ వేబిల్లులకు సంబంధించి జీఎస్టీ కౌన్సిల్‌లో రెండురకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరిన్ని సంప్రదింపులు జరుపాల్సి ఉంది. అంతవరకు ప్రత్యామ్నాయ, తాత్కాలిక నిబంధనలు వర్తిస్తాయి అని మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. ఈ వేబిల్లులకు సంబంధించి కౌన్సిల్ త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని వెల్లడించారు. 


Loading...