జైపూర్‌లో ఏడుగురికి జికా వైరస్‌ లక్షణాలు

జైపూర్‌లో ఏడుగురికి జికా వైరస్‌ లక్షణాలు

   జైపూర్‌: రాజస్థాన్‌ జైపూర్‌లో జికా వైరస్‌ లక్షణాలు ఏడుగురికి ఉన్నట్లు పరీక్షలో నిర్ధారణ అవ్వడంతో కేంద్ర ఆరోగ్య శాఖ వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ) కోరింది. ప్రస్తుత పరిస్థితిని తెలుసుకోవడానికి మంత్రిత్వ శాఖకు చెందిన బృందం జైపూర్‌ను మంగళవారం సందర్శించనుంది. సెప్టెంబరు 24 న ఓ వ్యక్తికి జికా వైరస్‌ ఉన్నట్లు వెల్లడి కాగా, 22 శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం పుణెలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపించారు. జైపూర్‌లో జికా వైరస్‌ వ్యాప్తిపై సమగ్ర నివేదికను పిఎంఒ కోరిందని సీనియర్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఏడుగురికి ఈ వ్యాధి లక్షణాలు కనిపించగా, వారిని ప్రత్యేక వార్డుల్లో ఉంచామని రాజస్తాన్‌ ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. మొట్టమొదటి కేసు నమోదైన శాస్త్రినగర్‌ ప్రాంతంలో వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. జైపూర్‌లో చదువుతున్న ఓ వ్యక్తి ఆగస్టు 28న బీహార్‌లోని సివన్‌లోని తన నివాసానికి వచ్చాడు. అతనికి ఈ జికా వైరస్‌ ఉందని నిర్ధారణైంది. తల్లిద్రండులను కూడా పర్యవేక్షిస్తున్న వైద్య బృందం, బీహార్‌లోని 38 జిల్లాలోని కూడా జాగ్రత్త వహించాలని సూచించింది.