జమ్ముకశ్మీర్‌ లో మరో కథువా అత్యాచార ఘటన

జమ్ముకశ్మీర్‌ లో మరో కథువా అత్యాచార ఘటన

 జమ్ముకశ్మీర్‌ : దేశాన్ని కుదిపేసిన కథువా అత్యాచార ఘటనను మరువక ముందే జమ్ముకశ్మీర్‌లో బకర్వాల్ తెగకు చెందిన మరో మైనర్ బాలికపై లైంగికదాడి జరిగింది. భయంతో మొదట ఈ దారుణాన్ని దాచిపెట్టిన ఆ బాలిక.. తాను మూడు నెలల గర్భవతి అని తెలియడంతో విషయం తల్లిదండ్రులకు వెల్లడించింది. బాలిక ప్రాణాలకు ప్రమాదమున్న నేపథ్యంలో వైద్యులు ఆ చిన్నారికి అబార్షన్ చేశారు. జమ్ముకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో రామ్‌షూ ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది. లైంగికదాడి ఘటనపై రామ్‌షూలో నిరసనలు వెల్లువెత్తాయి. పోలీసులు దర్యాప్తులో జాప్యం చేస్తున్నారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. జమ్ము నుంచి ముస్లింలను తరిమివేయడంలో ఇది మరో ప్రయత్నమని మండిపడుతున్నారు. బాలిక పశువులను మేపుతుండగా, నాలుగైదుగురు ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లారని బాధితురాలి తండ్రి చెప్పారు. వేడుకున్నా విడిచిపెట్టలేదని, దారుణంగా కొట్టి నిందితుల్లో ఒకడు తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని, అనంతరం తాను స్పృహ కోల్పోయినట్లు బాలిక చెప్పిందని ఆమె తండ్రి తెలిపారు. 


విషయం బయటకు చెబితే చంపేస్తామని నిందితులు బెదిరించినట్లు తెలిపిందన్నారు. తాను గర్భవతిని అని తెలియడంతో బాలిక నిందితుల్లో ఒకరిని సంప్రదించిందని, అతడు ఆమెకు మందులు తెచ్చిచ్చినట్లు బాలిక బంధువు ఒకరు తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు జనవరి 4న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని రాంబన్ ఎస్పీ అనితా శర్మ తెలిపారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. బాలికపై లైంగికదాడి జరిగిందని, అయితే అది సామూహిక లైంగికదాడా అనేది చెప్పలేమని, బాలిక తల్లి కూడా ఒకరినే నిందితుడిగా పేర్కొందని చెప్పారు. ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. గతేడాది జరిగిన కథువా హత్యాచార ఘటనను మరువక ముందే మరో ఘటన జరగడంతో బకర్వాల్ తెగ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మేము ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలనుకుంటున్నాం. వారు దీన్ని నరకంగా మార్చారు. వారు మమ్మల్ని చంపేసి ఉన్నా బాగేండేది. మా కూతురిపై ఎందుకు ఇంతటి దారుణానికి పాల్పడ్డారు? అని బాధితురాలి తండ్రి వాపోయారు. లైంగికదాడి ఘటనపై జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ విచారం వ్యక్తం చేశారు. ఇక నిందితులను కాపాడేందుకు నాయకులు బయటకు వస్తారంటూ మండిపడ్డారు. దారుణానికి బదులు బాధితురాలి కులం, మతంపై ప్రశ్నలు లేవనెత్తుతారన్నారు.