కన్నడ పీఠంపై కుమారస్వామి

కన్నడ పీఠంపై కుమారస్వామి

 బెంగళూరు : కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి బుధవారం సాయంత్రం ప్రమాణం చేశారు. బెంగళూరులోని విధానసౌధ (అసెంబ్లీ) ప్రాంగణంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో కుమారస్వామితో గవర్నర్ వజూభాయ్ వాలా ప్రమాణం చేయించారు. ఆయన తర్వాత ఉపముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత, పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర ప్రమాణం చేశారు. తెల్లని లుంగీ, ఖద్దరు అంగీ ధరించిన కుమారస్వామి దైవసాక్షిగా, కన్నడనాడు ప్రజల సాక్షిగా కన్నడంలో ప్రమాణం చేశారు.

కర్ణాటక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. గతంలో 2006 ఫిబ్రవరి 2న బీజేపీ-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో తొలిసారి సీఎం అయిన కుమారస్వామి 2007 అక్టోబర్ వరకు ఆ పదవిలో కొనసాగారు. శుక్రవారంనాడు అసెంబ్లీలో కుమారస్వామి ప్రభుత్వం విశ్వాసపరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాని తర్వాతే మంత్రివర్గ ఏర్పాటు ఉండనుంది. బుధవారం జరిగిన ప్రమాణస్వీకారోత్సవానికి యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతోపాటు పలువురు కీలక నేతలు, వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

వేదికపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కేరళ సీఎం పినరాయి విజయన్, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ నేత శరద్‌పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ కార్యదర్శి డీ రాజా, జేడీయూ తిరుగుబాటు నేత శరద్‌యాదవ్, ఆర్‌ఎల్డీ నేత అజిత్‌సింగ్, జేఎంఎం నేత హేమంత్ సొరేన్, లాలూప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్, ఎంఎన్‌ఎం అధినేత కమల్‌హాసన్ తదితరులు ఉన్నారు.

సుమారు మూడువేల మంది వీఐపీలు, పెద్దఎత్తున ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వచ్చేఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు విస్తృత కూటమికి సిద్ధమవుతున్నామన్న సంకేతాన్నిస్తూ కుమారస్వామి ప్రమాణ కార్యక్రమం బీజేపీ వ్యతిరేక పార్టీల బలప్రదర్శనకు వేదికగా కనిపించింది. మొన్నటివరకు ఎడమొహం పెడమొహంగా ఉన్న పార్టీలు కలిసి నడిచేందుకు సిద్ధమవడం ఆసక్తికరంగా మారింది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. 
 

బీజేపీ, కాంగ్రెస్‌లకు బిజూజనతాదళ్ సమానదూరంలో ఉంటున్నందున నవీన్ పట్నాయక్ ఈ కార్యక్రమానికి వెళ్లలేదని పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌కుమార్ సాహూ తెలిపారు. ఇక మహారాష్ట్రలో ఉపఎన్నికలు ఉన్నందున రాలేమని పేర్కొంటూ శివసేన చీఫ్ ఉద్ధవ్‌ఠాక్రే తనకు అందిన ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు. తూత్తుకుడి కాల్పుల ఘటన నేపథ్యంలో అక్కడికి వెళ్లాల్సి ఉన్నందున డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ కూడా బెంగళూరు ప్రమాణ స్వీకారోత్సవానికి రాలేకపోయారు. ఇక తన బిజీ షెడ్యూల్ కారణంగా తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు మంగళవారంనాడే బెంగళూరు వెళ్లి జేడీఎస్ నేతలకు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.