కార్గిల్‌లో బిజెపికి ఎదురుదెబ్బ

కార్గిల్‌లో బిజెపికి ఎదురుదెబ్బ

    శ్రీనగర్‌: ఇటీవల ముగిసిన లడక్‌ స్వయంపాలిత అభివృద్ధి మండలి, కార్గిల్‌ ఎన్నికల్లో బిజెపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో కాషాయ పార్టీకి కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కటం గమనార్హం. ఈ ఎన్నికల్లో బిజెపి కార్గిల్‌ జిల్లాపైనే ప్రధానంగా దృష్టి సారించినప్పటికీ బౌద్ధుల ఆధిపత్యం వున్న ఝన్స్కార్‌ అసెంబ్లీ స్థానంలో బిజెపిపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో కొనసాగుతుండటం వల్లే ఈ ఫలితాలు వచ్చాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీనితో పాటు భారత రాజ్యాంగంలో జమ్మూ కాశ్మీర్‌కు వున్న ప్రత్యేక ప్రతిపత్తిని వ్యతిరేకిస్తున్న బిజెపికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని వారు అభిప్రాయపడుతున్నారు. కార్గిల్‌ పాలనా బాధ్యతలను నిర్వహించే ఈ మండలిలో వున్న మొత్తం 30 స్థానాలకు గాను తమ తరఫున 14 మంది అభ్యర్థులను కాషాయ పార్టీ బరిలోకి దించింది. గత ఏడాది పిడిపి నుండి బయటకు వచ్చిన ఇండిపెండెంట్‌ శాసనసభ్యుడు బకీర్‌ హుస్సేన్‌ రిజ్వీకి ఆరు స్థానాలు ఇచ్చేలా పొత్తు కుదుర్చుకుంది. 

దీనితో పాటు కౌన్సిల్‌లో నాలుగు నామినేటెడ్‌ స్థానాలు కూడా వున్నాయి. రెండు జిల్లాల్లో పోటీ చేసిన 18 మందిలో కేవలం ఒక్కరు మాత్రమే కాషాయ పార్టీ తరపున మండలిలోకి అడుగు పెడుతుండటం విశేషం. ఝన్స్కార్‌ నియోజకవర్గంలో కేవలం ఒక్క ఛా స్థానంలో మాత్రమే బిజెపి అభ్యర్థి స్టాంజిన్‌ లక్పా గెలుపొందారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ తరపున పోటీ చేసిన టెంజిమ్‌ సోనమ్‌పై 30 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. తమకు కంటితుడుపు విజయం లభించినప్పటికీ బిజెపి ఐదుగురు ఇండిపెం డెంట్లకు మద్దతు ప్రకటించింది. గత సంకీర్ణ ప్రభుత్వంలో బిజెపికి మిత్రపక్షంగా వ్యవహరించిన పిడిపికి కేవలం రెండు స్థానాలు మాత్రమే లభించాయి. పది స్థానాలతో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎనిమిది స్థానాలతో కాంగ్రెస్‌ పార్టీ రెండో స్థానాన్ని దక్కించుకుంది.