కాశ్మీర్‌పై అర్థవంతమైన చర్యలు

కాశ్మీర్‌పై అర్థవంతమైన చర్యలు

  న్యూఢిల్లీ : కాశ్మీర్‌ సమస్యపై అర్థవంతమైన చర్యలు చేపట్టాలని భారత్‌, పాకిస్తాన్‌లకు ఐరాస మానవ హక్కుల మండలి నూతన చీఫ్‌ మిచెల్లి బచ్లెట్‌ కోరారు. మండలి 39వ సమావేశంలో ఆమె ప్రారంభోపన్యాసం చేస్తూ, న్యాయం, ఆత్మగౌరవానికి సంబంధించి ప్రపంచంలో అందరికీ వుండే హక్కులే కశ్మీరీలకు కూడా ఉండాలని చెప్పారు. ఐరాస మానవ హక్కుల కమిషన్‌లో ఆమె చేసిన తొలి ప్రసంగమిది. స్వలింగ సంపర్కం నేరం కాదు అంటూ ఇటీవల భారత న్యాయ స్థానం ఇచ్చిన తీర్పును బచ్లెట్‌ ప్రశంసించారు. కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐరాస ఇచ్చిన నివేదిక గురించి ఆమె ప్రధానంగా ప్రస్తావిస్తూ, దీనిపై అర్థవంతమైన చర్యలు తీసుకోవడంపై భారత్‌, పాకిస్తాన్‌ దృష్టి పెట్టాలన్నారు. 

ఈ మేరకు ఒక లిఖిత పూర్వక ప్రకటనను కూడా ఆమె విడుదల జేశారు. ఐరాస మానవ హక్కుల కమిషనర్‌ చిలీ మాజీ అధ్యక్షుడు జీద్‌ రాడ్‌ అల్‌ హుసేన్‌ నుంచి బచ్లెట్‌ కొత్తగా ఈ బాధ్యతలు స్వీకరించారు. వాస్తవాధీన రేఖకు ఎటువైపు ఉన్నావారికైనా కాశ్మీర్‌ను బేషరతుగా అందుబాటులో వుంచాలని, అదే సమయంలో దీనిపై నిరంతర పర్యవేక్షణ, నివేదన వుండాలన్న ఐరాస మానవ హక్కుల మండలి వైఖరిని ఆమె పునరుద్ఘాటించారు. బచ్లెట్‌కుముందున్న జీద్‌ హుస్సేన్‌ గత జూన్‌లో ఐరాస మానవ హక్కుల మండలి ముందు తన నివేదిక ఉంచుతూ, కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన ఆరోపణలపై సమగ్ర, స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్‌చే దర్యాప్తు జరిపించాలని కోరారు.

అంతర్జాతీయ న్యాయ నియమాల ప్రకారం కశ్మీరీయుల హక్కు, స్వయం నిర్ణయాధికారాన్ని పూర్తిగా గౌరవించాలని కోరారు. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరే చేసే వలస విధానాన్ని కూడా ఆమె తప్పుబట్టారు. ట్రంప్‌ ప్రభుత్వం ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని బచ్లెట్‌ కోరారు. మధ్యధరా సముద్రం మీదుగా వచ్చే శరణార్థుల పట్ల మానవీయ దృక్పథంలో వ్యవహరించాలని ఆమె సూచించారు. భారత్‌ ఆ నివేదికపై తీవ్రంగా స్పందిస్తూ, ఇది తప్పుడు ధోరణులతో, ఉద్దేశాలతో కూడినదంటూ దానిని తోసిపుచ్చింది. భారత సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించేదిగా వుందన్నది.