కాశ్మీర్‌ లోయలో బంద్‌

కాశ్మీర్‌ లోయలో బంద్‌

   శ్రీనగర్‌: స్థానిక సంస్థల ఎన్నికల రెండో రోజున కూడా కాశ్మీర్‌ లోయలో ప్రజాజీవనం స్తంభించిపోయింది. ఒకవైపు ఆర్టికల్‌ 35ఎ, ఆర్టికల్‌ 370కి తూట్లు పొడుస్తూ, మరో వైపు ఏకపక్షంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ ధోరణికి వ్యతిరేకంగా వేర్పాటువాదులు బుధవారం బంద్‌కు పిలుపునిచ్చారు. వేర్పాటువాదుల పిలుపుమేరకు మార్కెట్లను మూసివేశారు. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. ముందు జాగ్రత్తగా అధికారులు ఇంటర్నెట్‌ను సేవలను నిలిపివేశారు. స్థానిక హవాల్‌ ప్రాంతంలోని అభ్యర్థుల నివాసాలపై పెట్రో బాంబులతో దాడులు జరిగాయని, అయితే ఎటువంటి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. కాగా, జమ్ముకాశ్మీర్‌కు రాజ్యాంగ బద్దంగా ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించే ఆర్టికల్‌ 35ఎ, ఆర్టికల్‌ 370లపై స్పష్టతను ఇచ్చేవరకు ఎన్నికలలో పాల్గొనకూడదని జమ్మూ కాశ్మీర్‌లోని ప్రధాన పార్టీలైన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సి), పీపుల్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పిడిపి) నిర్ణయించిన సంగతి తెలిసిందే.