కూలిపోయిన నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌

కూలిపోయిన నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌

  లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్‌ శనివారం కూలిపోయింది. యుపి రాజధాని లక్నోకు 205 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాతీయ రహదారి 28కి అనుసంధానంగా ఈ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. అతనిని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సను అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రెండు వారాలుగా ఈ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయని, దీంతో ఫ్లైఓవర్‌కు సపోర్ట్‌గా ఉంచిన ఇనుప కమ్మీలు మట్టిలో కుంగిపోవడంతో ఫ్లైఓవర్‌ కూలిపోయినట్లు ప్రత్యక్షసాక్షులు పేర్కొన్నారు. కాగా, దీనికింద మరో ఇద్దరు కార్మికులు చిక్కుకుని ఉండవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుందని అధికారులు పేర్కొన్నారు. గతవారం భారీ వర్షాల ధాటికి ఆగ్రా-లక్నో రహదారి కోట్టుకుపోయిన సంగతి తెలిసిందే. మేనెలలో వారణాసిలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ కూలిపోవడంతో అనేకమంది మృతిచెందారు.