లాలూ కుమారుడితో ఐశ్వర్యరాయ్ వివాహం

లాలూ కుమారుడితో ఐశ్వర్యరాయ్ వివాహం

 పాట్నా: ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడితో ఐశ్వర్యరాయ్ వివాహమేంటి? అని ఆశ్చర్యపోతున్నారా. మీరు చదివింది నిజమే. వీరి పెండ్లి వచ్చే నెల 12న అంగరంగ వైభవంగా జరిపించేందుకు లాలూ భార్య రబ్రీదేవి ఏర్పాట్లు కూడా చేస్తున్నారట. అయితే ఈ ఐశ్వర్యరాయ్ మీరు అనుకుంటున్నట్లుగా బాలీవుడ్ నటి కాదు. లాలూ, రబ్రీ దంపతుల కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పెండ్లి చేసుకునే ఈ యువతి... బీహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగా ప్రసాద్‌రాయ్ మనుమరాలు. ఆమె తండ్రి సీనియర్ ఆర్జేడీ నేత చంద్రికా రాయ్... లాలూ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశారు. ఈనెల 18 న నిశ్చితార్థం ఏర్పాట్లు చేస్తున్నట్లుగా లాలూ కుటుంబీకులు తెలిపారు. ఢిల్లీలో ఉన్నత విద్యాభ్యాసం చేసి, అమిటీ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా అందుకున్న ఐశ్వర్యరాయ్... ఇప్పటికే 40 పెండ్లి ప్రతిపాదనల్ని తిరస్కరించిన తేజ్ ప్రతాప్ యాదవ్‌ను త్వరలో పెండ్లాడనున్నారు. ఇంటిని చక్కగా నడిపించే, పెద్దలంటే గౌరవం చూపే సంస్కారమున్న అమ్మాయిలు తనకు కోడళ్లుగా రావాలని రబ్రీదేవి గతంలో ఓసారి అన్నారు.