మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పులు

మధ్యప్రదేశ్ సీఎం కాన్వాయ్‌పై రాళ్లు, చెప్పులు

 చుర్హట్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు సోమవారం చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం శివరాజ్‌సింగ్ చేపట్టిన జన్ ఆశీర్వాద్ యాత్రకు ఆటంకాలు ఎదురయ్యాయి. సిధి జిల్లా చుర్హట్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సీఎం వాహనశ్రేణిపై కొందరు దుండగులు చేసిన రాళ్లదాడిలో బస్సు అద్దం పగిలింది. చెప్పులు చూపిస్తూ కొందరు, నల్లజెండాలతో మరికొందరు నిరసన తెలిపారు. చుర్హట్ నుంచి కాంగ్రెస్ నేత అజయ్‌సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్సే ఈ దాడులకు పాల్పడిందని బీజేపీ ఆరోపించింది. అనంతరం జరిగిన బహిరంగసభలో సీఎం శివరాజ్‌సింగ్ మాట్లాడుతూ.. నాపై దాడికి ప్రధాన సూత్రధారి విపక్షనేత అజయ్‌సింగ్. దమ్ముంటే ఆయన నాతో ప్రత్యక్ష పోరుకు సిద్ధంకావాలి.

నేను శారీరకంగా బలంగా లేకపోవచ్చు. కానీ, ఇలాంటి చర్యలకు తలొగ్గే ప్రసక్తేలేదు. రాష్ట్ర ప్రజలంతా నా వెంటే ఉన్నారు. కాంగ్రెస్ నా రక్తం తా గాలని చూస్తున్నది. పార్టీల మధ్య వైరుధ్యాలున్నా రాష్ట్రంలో ఇప్పటివరకూ ఒకరి ఎన్నికల ర్యాలీలను మరొకరు అడ్డుకోలేదు. కానీ, తొలిసారి కొత్త తరహా రాజకీయ హింసకు కాంగ్రెస్ తెరలేపింది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుంది అని అన్నారు. మరోవైపు రాళ్లదాడిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అజయ్‌సింగ్ మాట్లాడుతూ..ఈ ఘటనతో తమ పార్టీ కార్యకర్తలకు సంబంధంలేదని పేర్కొన్నారు. సీఎం కావాలనే కుట్రపూరితంగా తనపై దాడి చేయించుకుని కాంగ్రెస్, చుర్హట్ ప్రజలను అవమానించాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. మరోవైపు రాళ్లదాడికి పాల్పడిన దుండగుల్ని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.