మధ్యప్రదేశ్‌లో ఐదుగురు బాబాలకు సహాయ మంత్రి హోదా

మధ్యప్రదేశ్‌లో ఐదుగురు బాబాలకు సహాయ మంత్రి హోదా

  భోపాల్‌ : మధ్య ప్రదేశ్‌లోని బిజెపి ప్రభుత్వం ఐదుగురు సాధువులకు సహాయ మంత్రి హోదాలు కల్పించింది. దీనిపై రాజకీయంగా వివాదం చెలరేగుతోంది. ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో బిజెపి బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతుందని ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఆరోపించింది. కంప్యూటర్‌ బాబా, నర్మదానంద్‌ మహారాజ్‌, హరిహరనంద్‌ మహారాజ్‌, భయ్యూ మహారాజ్‌, పండిట్‌ యోగేంద్ర మహంత్‌లు మంత్రులకు ఇచ్చే ప్రోత్సాహకాలను అనుభవిస్తున్నారు. నర్మదా నది సంరక్షణ కమిటి సభ్యులుగా వారి పనిని సులభతరం చేసేందుకు వారికి సహాయ మంత్రుల హోదా కల్పించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గత నెలలో కొంతమంది బాబాలను కూడా ఈ గ్రూపులో సభ్యులుగా చేర్చారు. తమకు సహాయ మంత్రి హోదాను కల్పించడంపై వివాదం చెలరేగిన నేపథ్యంలో అందులో తప్పేముందంటూ కంప్యూటర్‌ బాబా స్పందించారు. 

తాము చేసిన పనికి రివార్డుగా ఆ హోదాను ఇచ్చారని చెప్పారు. నర్మద ఘోతల (అవినీతి) రధయాత్రను చేపట్టనున్నట్లు కంప్యూటర్‌ బాబా అంతకుముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. నర్మదా నది సంరక్షణ పనులలో పెద్ద ఎత్తున చోటుచేసుకున్న అవినీతిని బహిర్గతం చేసేందుకు నర్మద రథయాత్ర నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ మాత్రం దీనిని ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వపు ఎత్తుగడగా పేర్కొంది. రాజకీయ ప్రయోజనాన్ని పొందేందుకే బాబాలకు సహాయ మంత్రి హోదా కల్పించినట్లు పేర్కొంది. ఎన్నికల్లో గెలుపొందేందుకే కాషాయ బాబాలను వారు ఉపయోగించుకోవాలను కుంటున్నారని కాంగ్రెస్‌ నేత రాజ్‌ బబ్బర్‌ ఢిల్లీలో అన్నారు. కాషాయాంబరధారి ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా ఉంటే ఏంజరిగిందో వాళ్ళు గుణపాఠం నేర్చుకోవాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి తన పాపాలను కడుక్కునేందుకే బాబాలకు సహాయ మంత్రుల హోదా కల్పించారని రాష్ట్ర కాంగ్రెస్‌ నేత పంకజ్‌ చతుర్వేది వ్యాఖ్యానించారు. నర్మదా సంరక్షణను ఆయన నిర్లక్ష్యం చేశారన్నారు.