మహా కూటమితో వారికి ఓటమే!

మహా కూటమితో వారికి ఓటమే!

 న్యూఢిల్లీ : బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటవుతున్న మహాకూటమిపై ప్రధాని నరేంద్రమోదీ విమర్శలు గుప్పించారు. మహాకూటమి ఓ విఫల ప్రయోగంగా అభివర్ణించారు. పక్షపాతం, అవినీతిని ప్రోత్సహించేందుకు బలహీన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు విపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్నాయని విమర్శించారు. అయితే బీజేపీ మాత్రం సమగ్రాభివృద్ధి కోసం బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నదని చెప్పారు. రామ మందిరం వివాదం విషయంలోనూ కాంగ్రెస్‌పై మోదీ విరుచుకుపడ్డారు. 

అయోధ్య వివాదం పరిష్కారం కాకుండా తమ లాయర్ల ద్వారా కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు సృష్టిస్తున్నదని మండిపడ్డారు. న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో శనివారం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్, ఆ పార్టీ సంస్కృతికి వ్యతిరేకంగా ఏర్పాటైన పార్టీలు నేడు అదే పార్టీతో చేతులు కలుపుతున్నాయని ఆయన విమర్శించారు. అవినీతికి ముగింపు పలికేందుకు బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. మహాకూటమి పేరుతో నేడు దేశంలో ఓ విఫల ప్రయోగం జరుగుతున్నదని, బలహీన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వారంతా ఏకమవుతున్నారని విమర్శించారు.

తమ దుకాణాలు మూతపడతాయనే వారు బలమైన ప్రభుత్వాన్ని కోరుకోవట్లేదని ఎద్దేవా చేశారు. రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి వ్యతిరేకంగా సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ పొత్తు కుదర్చుకున్న నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. సీబీఐకి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకున్న ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలపై ఆయన విమర్శలు గుప్పించారు. సీబీఐ అంటే ఎందుకు భయపడుతున్నారని, ఏయే అక్రమాలకు పాల్పడ్డారని ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులను ప్రశ్నించారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాటి యూపీఏ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలతో కొన్నేండ్ల పాటు తనను వేధింపులకు గురిచేసినప్పటికీ రాష్ట్రంలోకి సీబీఐ ప్రవేశంపై నిషేధం విధించలేదని చెప్పారు. తదుపరి ప్రధాన సేవకుడిగా నిజాయితీపరుడు, కష్టపడే వ్యక్తి కావాలా లేక అవినీతిపరులు, అవసరమైన సమయాల్లో అందుబాటులో లేకు ండా విహారయాత్రలకు వెళ్లే వారు కావాలా అనేది దేశ ప్రజలే తేల్చుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.