‘మీ టూ’ కేసుల పరిశీలనకు కమిటీ

‘మీ టూ’ కేసుల పరిశీలనకు కమిటీ

  న్యూఢిల్లీ : దేశవ్యాపితంగా 'మీటూ''ఉద్యమం ద్వారా వెల్లువెత్తుతున్న మహిళా చైతన్యంపై కేంద్రం స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది. గత పది హేను రోజులుగా మీ టూ ఉద్యమం బాగా వూపం దుకుంది. వివిధ రంగాలకు చెందిన మహిళలు తమ పని ప్రదేశాల్లో ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై నోరు విప్పారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా వున్న అక్బర్‌పై ఏడుగురు మహిళలు ఇప్పటివరకు లైంగిక వేధిం పుల ఫిర్యాదులు చేయటంతో ఈ సెగ కేంద్రాన్ని కూడా తాకింది. 

వేధింపులకు గురైన మహిళలకు మద్దతు గా సినీనటులు, జర్నలిస్టులు, న్యాయ మూర్తులు, వివిధ రంగాల ప్రముఖులు మద్దతు తెలియ జేయటం పెరుగుతుండటంతో కేంద్రం ఎట్టకేలకు స్పందించింది. మీ టూ' ఉద్యమంలో భాగంగా బయటపడుతున్న లైంగిక వేధింపుల కేసులను విచారించేందుకు నలుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటిం చింది. ఈ కమిటీలో రిటైరైన న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు సభ్యులుగా వుంటారని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ శుక్రవారం తెలిపారు. 

''వారందరూ చెప్పింది నమ్ముతున్నాను, ప్రతి ఒక్క ఫిర్యాదుదారుని వెనుక గల నొప్పి, బాధను అర్ధం చేసుకోగలను.' అని ఆమె పేర్కొన్నారు. లైంగిక వేధింపుల ఫిర్యాదులను విచారణ నిమిత్తం చేపట్టడానికి అవసరమైన న్యాయ, వ్యవస్థాగత విధానాలను ఈ కమిటీ పరిశీలిస్తుందని, ఆ విధానాలను, వ్యవస్థను ఏ రీతిన బలోపేతం చేయాలో తమ మంత్రిత్వశాఖకు సలహాలిస్తుందని ఆమె చెప్పారు.