మిజోరాం సిఇఓ తొలగింపు కోసం డిమాండ్‌

మిజోరాం సిఇఓ తొలగింపు కోసం డిమాండ్‌

  ఐజ్వాల్‌ : మిజోరాం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సిఇఓ) తొలగింపు కోసం డిమాండ్‌ ఊపందుకుంది. సిఇఓ తొలగింపు డిమాండ్‌తో రాష్ట్రంలో బుధవారం నాడు భారీయెత్తున నిరసన ప్రదర్శనలు జరగటంతో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ మిజో ప్రభుత్వాన్ని కోరింది. ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి లాల్నన్‌మావియా చువాంగో తీరు సక్రమంగా లేదని తేలటంతో ఆయన్ను బదిలీ చేసిన విషయాన్ని ఇసి మిజో సర్కారుకు రాసిన లేఖలో ప్రస్తావించింది. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో హోంశాఖ కార్యదర్శి చువాంగో అనుచిత జోక్యం చేసుకున్నట్లు వార్తలు రావటంతో ఇసి సోమవారం నాడు ఆయన్ను బదిలీ చేసింది. ఆ మరునాడే విద్యార్థి సంఘాలు, పౌర సంఘాలతో కూడిన ఎన్‌జిఓ కో-ఆర్డినేషన్‌ కమిటీ సిఇఓను ఎస్‌బి శశాంక్‌ను కూడా తొలగించాలని డిమాండ్‌ చేస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. ఈ నిరసనల నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితిని అంచనా వేసేందుకు ఇసి ముగ్గురు సభ్యుల ప్రతినిధి బృందాన్ని రాష్ట్రానికి పంపిందని అధికార వర్గాలు తెలిపాయి.