మోడీ దళిత వ్యతిరేకి:  రాహుల్‌ గాంధీ

మోడీ దళిత వ్యతిరేకి:  రాహుల్‌ గాంధీ

 న్యూఢిల్లీ -ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. గురువారం నాడిక్కడ స్థానిక పార్లమెంట్‌ స్ట్రీట్‌లో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌ చేర్చాలని డిమాండ్‌ చేస్తూ ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్ట పరిరక్షణ కమిటీ నేతృత్వంలో 'సింహ గర్జన' ఆందోళన జరిగింది. ఈ ఆందోళనలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సిపిఎం, సిపిఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్‌ రెడ్డిలు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, ప్రభుత్వం చట్టానికి రక్షణ కల్పించడంలో విఫలమైతే, 2019లో అధికారంలోకి రాగానే చట్టబద్దంగా రక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు. 

మోడీ సర్కార్‌ దళిత వ్యతిరేక ప్రభుత్వమని దుయ్యబట్టారు. దేశంలో దళిత, గిరిజనులపై దాడులు ప్రోత్సహించే విధంగా మోడీ సర్కార్‌ పాలన ఉందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని, అందులో భాగంగానే ఈ చట్టానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి గోయల్‌కు బహుమానంగా పదోన్నతి కల్పించారని దుయ్యబట్టారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు పెరిగాయని అన్నారు. ఉద్యమాలకు దిగొచ్చి ప్రభుత్వం లోక్‌సభలో బిల్లు పెట్టిందని, దళిత, గిరిజన వర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ చట్టం పరిరక్షణకు జరిగే ఉద్యమాలకు అండగా ఉంటామని, మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించితే తప్ప దళిత, గిరిజనలు స్వేచ్ఛగా తిరగలేరన్నారు.

సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్‌ చేశారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ చట్ట పరిరక్షణకు జరిగే ఉద్యమానికి సిపిఎం మద్దతు తెలుపుతుందని అన్నారు. మోడీ సర్కార్‌ దళితులపై సవతి తల్లి ప్రేమ కురిపిస్తోందని, దళితోద్ధారకుడిని అని చెప్పుకునే మోడీ దళితులపై జరుగుతున్న దాడులపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఏప్రిల్‌ 2న జరిగిన భారత్‌ బంద్‌లో బిజెపి పాలిత రాష్ట్రాల్లో అమాయక దళిత యువకులపై పోలీసులు విరుచుకుపడ్డారని, 12 మందిని హతమార్చారని తెలిపారు. ఇప్పటికే వందలాది మంది ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, హర్యానా వంటి రాష్ట్రాల్లో జైల్లో ఉన్నారని గుర్తు చేశారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ,ఎస్టీ చట్టాన్ని పరిరక్షించాలని కోరితే, జైల్లో పెట్టడం దారుణమని అన్నారు.

మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై వివిధ రూపాల్లో దాడులు పెరిగాయని ఏచూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. . వారికి రావాల్సిన నిధులు కూడా విడుదల చేయకుండా ఉండేందుకు ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌నే ఎత్తివేశారని అన్నారు. దేశంలో మోడీ సర్కార్‌ పాలనతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని విమర్శించారు. 
దేశంలో ఒక పక్క దళిత, గిరిజనులపై దాడులు, మరోపక్క వారికి రక్షణ లేకుండా చేసేందుకు మోడీ సర్కార్‌ కుట్ర పన్నుతోందని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి విమర్శించారు. ఇది ముమ్మాటికీ మోడీ సర్కార్‌ కుట్రని ధ్వజమెత్తారు. దళితులపై దాడులను ప్రోత్సహిస్తూనే, దళితుల పట్ల ప్రేమను ఒలకబోస్తోందని ఎద్దేవా చేశారు. బిజెపి ఓట్ల రాజకీయం చేస్తోందని విమర్శించారు. తేడా వస్తే కేంద్ర ప్రభుత్వంపై దళిత, గిరిజన సమాజం యుద్ధం చేస్తాదని ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్ట పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ కో కన్వీనర్‌ అద్దంకి దయాకర్‌, జెబి రాజు, బిల్లయ్య నాయక్‌, రగిలి ప్రభాకర్‌, గురునాథ్‌, సత్యం, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.